శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు
21న కేబినెట్ ముందుకు ముసాయిదా : షిండే
చకచకా కదులుతున్న ఫైళ్లు
అదే వేగంతో సమావేశాలు
న్యూఢిల్లీ, నవంబర్ 14 (జనంసాక్షి) :
శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. తెలంగాణ బిల్లుపై వస్తున్న ఊహాగానాలకు ఆయన గురువారం తెరదించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఐదు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ దేశంలో 29వ కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేయాలనే బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీవోఎం) తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ ముమ్మరం చేసిందని అన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది గుర్తింపుపొందిన పార్టీల అభిప్రాయం కోరుతూ హోం మంత్రిత్వ శాఖ లేఖలు రాయగా, టీడీపీ మినహా మిగతా ఏడు పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాయన్నారు. అలాగే కేంద్రంలోని ఎనిమిది శాఖలకు చెందిన కార్యదర్శులతో మంత్రుల బృందం ప్రతినిధులు పంపకాలపై విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపారని అన్నారు. ముఖ్యమంత్రి అభిప్రాయం కోసం గురువారం రాత్రి 8 గంటలకు హాజరుకావాలని జీవోఎం కోరినా సీఎం ఢిల్లీకి వెళ్లలేదు. ఈనేపథ్యంలో సీఎంతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల అభిప్రాయాలను జీవోఎం తెలుసుకోనుంది. రెండు వారల్లోగా తెలంగాణ బిల్లు సిద్ధం చేయాలని ఇప్పటికే తమ శాఖ అధికారులను ఆదేశించినట్లు షిండే వెల్లడించారు. ఆస్తుల పంపకాలు, విడిపోయిన తర్వాత మిగిలే ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య పరిష్కారం కావాల్సిన ఇతర అంశాలపై వివిధ మంత్రిత్వ శాఖలు అందజేసిన నివేదికలను క్రోడికరించే పనిలో హోం శాఖ వర్గాలు తలమునకలై ఉన్నాయి. హోం శాఖ సిద్ధం చేసే బిల్లు కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి వద్దకు పంపుతామని షిండే అన్నారు. రాష్ట్రపతి ఆమోదించాక అభిప్రాయం కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపిస్తామన్నారు. అసెంబ్లీ అభిప్రాయం తర్వాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు రూపొందిస్తుంది. ఆ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదంతో రాష్ట్రపతికి పంపుతుంది. ఆయన బిల్లుకు ఆమోద ముద్ర వేశాక దాన్ని పార్లమెంట్లో చర్చకు ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందనుంది.