Wednesday, 4 November 2026

తెలంగాణలో సీఎంను వెలివేయండి

టీ కాంగ్రెస్‌ పిలుపు
న్యూఢిల్లీ, నవంబర్‌ 16 (జనంసాక్షి) :
తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ ప్రాంతంలో వెలివేయాలని టీ కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతానికి సీఎం ఎవరూ లేరని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ శనివారం న్యూఢిల్లీలో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో కిరణ్‌ ఫోటోలు పెట్టవద్దని ఆయన తెలంగాణ ప్రజలకు సూచించారు. సీఎంగా కిరణ్‌ను తాము గుర్తించబోవడం లేదన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడుతున్న తీరు దురదృష్టమన్నారు. కాంగ్రెస్‌కు ఆయన కృతజ్ఞుడిగా మారారని అన్నారు. రచ్చబండను తెలంగాణ వ్యతిరేక వేదికగా ఉపయోగించుకోవడం దారుణమన్నారు. ఇదిలావుంటే టిడిపి నేత ఎర్రబల్లిని ఎంపీ సీఎం రమేశ్‌ తక్కువ చేసి మాట్లాడడాన్ని పొన్నం తప్పుపట్టారు. తెలంగాణ ప్రాంతంలోని టీడీపీ నేతలు ఇప్పటికైనా ఆ పార్టీ వీడాలని ఆయన హితవు పలికారు. ఎర్రబల్లికి చదవు రాదని అనడం ఆయన నీచ సంస్కృతిని బయటపెట్టిందన్నారు. టిడిపిలో తెలంగాణ వారికి ప్రాధాన్యం లేదని ఈ ఘటనతో తేలిపోయిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ టిడిపి నేతలు పునరాలోచన చేసుకోవాలన్నారు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత దయాకరరావుని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ విమర్శించడం పట్ల ఎంపీ రాజయ్య కూడా మండిపడ్డారు. దయాకరరావు గురించి మాట్లాడే స్థాయి సీఎం రమేశ్‌కు లేదని రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సీఎం రమేష్‌కు రాజయ్య ఈ సందర్బంగా హితవు పలికారు. లేకుంటే నాలుకకు ఉప్పు పసుపు రాసి సన్నం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ లీడర్లపట్ల చులకనగా మాట్లాడితే క్షమించమన్నారు. తెలుగుదేశం పార్టీలో అర్హత లేని వ్యక్తులకు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారంటూ సీఎం రమేష్‌పై ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో సీఎం రమేష్‌కు చెందిన కాంట్రాక్‌ట్లను అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలను సీఎం రమేష్‌ ఖండించారు. ఎర్రబెల్లికి చదువు సంస్కారం లేవని సీఎం రమేష్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *