Wednesday, 4 November 2026

రెండు రాష్ట్రాలే సమన్యాయం

ఇరు ప్రాంతాల ప్రజలకు దోపిడీ నుంచి ముక్తి : కోదండరామ్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 16 (జనంసాక్షి) :
సీమాంధ్ర నాయకులు డిమాండ్‌ చేస్తున్న సమన్యాయం అర్థం లేనిదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సమన్యాయమంటే తెలంగాణ-సీమాంధ్ర భూభాగంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలుగా విడిపోవడమేనని ఆయన తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (టీవా) ఆవిర్భావ పోస్టర్‌ను ఆయన విద్యుత్‌ సౌధ ఆవరణలో ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు చేస్తూనే ఆంక్షల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని చూడటం సరికాదన్నారు. రెండు వేర్వేరు రాష్ట్రాలు ఏర్పడితేనే ఇరు ప్రాంతాల ప్రజలకు దోపిడీ నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు. ఆకాంక్షలు, కొర్రీలతో తెలంగాణ ప్రజలపై భారం మోపాలని చూస్తే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశముందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగు దశాబ్దాల పోరాటం తర్వాత కూడా సీమాంధ్రులు తప్పుడు సమాచారంతో హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టాలని చూస్తున్నారని, హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లాగా తప్ప మరే పరిధులతో ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేసినా పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీవా కన్వీనర్‌ రఘు, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *