Wednesday, 4 November 2026

టీ కాంగ్రెస్‌ నోట్‌ రెడీ

11 అంశాలు పొందుపరిచాం
భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే
హైదరాబాద్‌పై ఎవరి పెత్తనముండకూడదు
సమన్యాయానికి అర్థం చెప్పని బాబు యక్షప్రశ్నలెందుకు? : జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ, నవంబర్‌ 17 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ విభజనపై టీ కాంగ్రెస్‌ నోట్‌ సిద్ధం చేసింది. 11 అంశాలను ఈ నోట్‌లో పొందుపరిచింది. ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మేధోమధనం చేశాం.. విభజన విషయంలో ఏది సాధ్యం.. ఏది అసాధ్యమో.. ఒక నోట్‌ను రూపొందించాం.. అందరి నేతల అభిప్రాయాలతో నివేదిక తయారు చేశామని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆదివారం ఉదయం కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. జీవోఎంకు నివేదించాల్సిన అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. న్యాయాన్యాయాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలించాకే నివేదిక రూపొందించామన్నారు. టి.కాంగ్రెస్‌ తరఫున 11 అంశాలతో నివేదికను రూపొందించినట్టు.. జీవోఎంకు సోమవారం అందజేయనున్నట్టు చెప్పారు. టి.కాంగ్రెస్‌ తరఫున జీవోఎంకు నిర్మాణాత్మకమైన సూచనలు చేశామని అన్నారు. సీమాంధ్ర నేతలది అనవసర రాద్దాంతమని అన్నారు. అందరికీ మేలు చేయాలని.. మేలు జరగాలని కోరుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం సీమాంధ్ర ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయబోదన్నారు. అందరికీ న్యాయమే చేస్తుందని తెలిపారు. అభిప్రాయాలు చెప్పడం వరకే తమ బాధ్యత అని అన్నారు. ఇది ఆఖరి ప్రయత్నమన్నారు.తుది నిర్ణయం కేంద్రానిదేనని స్పష్టం చేశారు.  చంద్రబాబుది పలాయన వాదమన్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా..పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సమన్యాయం అంటే ఏమిటో చెప్పాలని డిమాండు చేశారు. భద్రాచలంలో తెలంగాణ అంతర్భాగమేనని, హైదరాబాద్‌పై ఎవరి పెత్తనాన్ని అంగీకరించబోమని జైపాల్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *