మాలే, నవంబర్ 17 (జనంసాక్షి) :
మాల్దీవుల్లో దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. దేశాధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ గయూం ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంటు సమావేశంలో ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అహ్మద్ ఫాయిజ్ ప్రమాణం చేయించారు. ఉపాధ్యక్షుడిగా మొహమ్మద్ జమీల్ ప్రమాణం చేశారు. మాజీ నియంతృత్వ పాలకుడు మౌమూన్ అబ్ధుల్ గయూమ్‌కు యమీన్ సవతిసోదరుడు. ఆర్థికవేత్త అయిన ఆయనకు 54 సంవత్సరాలు. ప్రోగ్రెసివ్ పార్టి ఆఫ్ మాల్దీవ్స్ తరుపున బరిలోకి దిగిన యమీన్ శనివారం నాటి నిర్ణాయాత్మక పోలింగ్‌లో 51.39 శాతం ఓట్లు సాధించారు. ఇంతకు ముందు ఎన్నికల్లో ముందంజలో నిలిచినప్పటికి అధికారానికి అవసరమైన 50శాతానికి పైగా ఓట్లను పొందలేకపోయిన మాజీ అధ్యక్షుడు, మాల్దీవ్స్ డెమొక్రటిక్ పార్టి అభ్యర్థి మొహమ్మద్ నషీద్ ఈ సారి 48.61 శాతం ఓట్లే తెచ్చుకోగలిగారు. మాల్దీవులను అత్యంత అభివృధ్ది చెందిన దేశంగా, అత్యంత సురక్షితమైనదిగా తీర్చిదిద్దుతానని ప్రమాణ స్వీకారం అనంతరం యమీన్ తన ప్రసంగంలో హామి ఇచ్చినట్లు తాను సగం జీతమే తీసుకుంటానని తెలిపారు. ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు నషీద్, మౌమూన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మాల్దీవుల అధ్యక్షుల్లో సంఖ్యాపరంగా యమీన్ ఆరోవారు. ప్రజాస్వామ్యబద్దంగా అధ్యక్షులైన వారిలో రెండోవారు. ఆయన నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. యమీన్ స్వదేశంతో పాటు లెబనాన్, అమెరికాల్లో విద్యనభ్యసించారు.
మాల్దీవుల అధ్యక్షుడిగా యామిన్ ప్రమాణం




