Wednesday, 4 November 2026

నేడు జీవోఎం కీలకభేటీ

కేంద్ర మంత్రులు, సీఎంతో సమావేశం
న్యూఢిల్లీ, నవంబర్‌ 17 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం కీలక భేటీ సోమవారం జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే 11 కీలకాంశాలపై ఇప్పటికే వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన మంత్రుల బృందం సోమవారం రాష్ట్రానికి చెందిన ఇరు ప్రాంతాల కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన ఎనిమిది పార్టీలను విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యలు సీమాంధ్రకు కొత్త రాజధాని, భద్రత, విద్యుత్‌, జలవనరులు, ఆస్తుల పంపకాలు, హైదరాబాద్‌ తదితర అంశాలపై తమ అభిప్రాయం చెప్పాలని జీవోఎం కోరింది. జీవోఎం రాసిన లేఖలపై తెలుగుదేశం మినహా మిగతా ఏడు పార్టీలు స్పందించి అఖిలపక్ష భేటీకి హాజరయ్యాయి. విడివిడిగా తమ అభిప్రాయాలు చెప్పాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనిమిది కీలకశాఖల కార్యదర్శులతో ఐదు గంటలకు పైగా జీవోఎం భేటీ అయి ఆయా అంశాల్లో పంపకాలపై చర్చించింది. ముఖ్యమంత్రితో జీవోఎం ప్రత్యేకంగా భేటీ కావాలని ఈనెల 14న రాత్రి 8 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చింది. అయితే అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో పాల్గొనే సాకుతో ముఖ్యమంత్రి కిరణ్‌ ఆ భేటీకి డుమ్మా కొట్టాడు. తాను సమైక్యవాదిని కాబట్టే జీవోఎం విభజన నేపథ్యంలో నిర్వహించే భేటీకి హాజరుకాబోవట్లేదని ముఖ్యమంత్రి సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన సొంత మీడియా చానెళ్లోనూ అదే ప్రచారంతో తానే సమైక్యాంధ్ర పరిరక్షకుడినన్నట్టు ప్రచారం చేసుకున్నాడు. అయితే ముఖ్యమంత్రి సొంతడబ్బాకు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెరదించారు. చిల్డ్రన్‌ ఫిలిం ఫెస్టివల్‌ సీఎం పాల్గొనాల్సి ఉన్నందునే ముఖ్యమంత్రి ఢిల్లీకి రాలేదని చెప్పాడు. అంతేకాదు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మనీశ్‌తివారీ స్వతంత్ర హోదా గల సహాయ మంత్రి, ఆయన పర్యటన కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రను రద్దు చేసుకున్నాడని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌ గాలితీసేశారు. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ధిక్కరిస్తే ఎంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో కిరణ్‌కు షిండే గట్టి సమాధానం ద్వారా బదులిచ్చారు. ఆ షాక్‌ నుంచి కిరణ్‌ తేరుకోకముందే మళ్లీ భేటీ తేదీ దగ్గరపడటంతో ఈ సారి సీఎంగా జీవోఎం ఎదుట భేటీ కాక తప్పలేదు. ఈ భేటీ తర్వాత జీవోఎం మరికొందరితో సంప్రదింపులు జరిపి 21న కేంద్ర మంత్రి మండలికి నివేదిక సమర్పించే అవకాశముంది. ఈ భేటీకి సీమాంధ్ర, తెలంగాణ కేంద్ర మంత్రులు ఇప్పటికే వేర్వేరుగా నివేదికలు సిద్ధం చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్‌ విభజనకు సానుకూలంగా ఉండటం, విభజన అనంతరం సీమాంధ్రకు కావాల్సిన నిధులు, కొత్త రాజధాని, విద్యాసంస్థలు, పరిశ్రమలు ఇతరత్రా విషయాలపై వారు ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. బయటికి సమైక్యమే తమ వాదం అని చెప్తున్నా విభజన తర్వాత సీమాంధ్రకు కావాల్సిన సౌకర్యాలపైనే వారి నివేదికలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణపై ఈ ప్రాంత కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి నివాసంలో భేటీ అయి నివేదిక సిద్ధం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *