భోపాల్, నవంబర్ 17 (జనంసాక్షి) :
అసత్య ప్రచారాలు, అభూత కల్పనలే నరేంద్రమోడీ ప్రచారాస్త్రాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారశైలిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌కు కేంద్రం కేటాయించే నిధులతో అభివృద్ధి చేసుకుంటూ అదంతా తన ఖాతాలో వేసుకుని అబద్ధాలు ఆడటం మోడీకే చెల్లిందని ఆరోపించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెడుతోందని తెలిపారు. ఆహార భద్రత, విద్యాహక్కు చట్టం అమలుకు ఎంతగానో కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు తర్వాత గ్రామీణ ముఖచిత్రంలో స్పష్టమైన మార్పు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే సామాన్యులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మోడీ చేస్తున్న అబద్ధపు ప్రచారానికి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
అసత్య ప్రచారాలు, అభూత కల్పనలే మోడీ ప్రచారం : ప్రధాని మన్మోహన్




