ఆంక్షలు వద్దు
ఉమ్మడి రాజధానే పెద్ద మినహాయింపు : జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ, నవంబర్ 18 (జనంసాక్షి) :
భద్రాచలంతో సహా పది జిల్లాల ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్, భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, దీనిపై ఆంక్షలు సహించబోమన్నారు. సోమవారం జీవోఎంతో తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రుల భేటీ ముగిసిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడారు. 12పేజీల నివేదికను జీవోఎంకు అందజేసినట్లు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలో భాగమన్నారు. భద్రాచలంతో కూడిన పూర్తి తెలంగాణ కావాలన్నారు. ఇందులో ఎలాంటి ఆంక్షలు సరికాదన్నారు. 371-డిపై తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ఉద్యోగులు ఒకే అభిప్రాయంతో ఉన్నారని, 371-డిని కొనసాగించాలని కోరారు. కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ సరిపోతుందని, గోదావరిపై ట్రైబ్యునల్ అవసరం లేదన్నారు. జీవోఎంకు లిఖితపూర్వక నోట్ ఇచ్చామని, విధాన నిర్ణయాలు తీసుకునేంత వరకు నోట్‌ను విడుదల చేయమని జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచడం చరిత్రలో అపూర్వమని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రెవెన్యూ పంపకం అంశం చర్చకు రాలేదన్నారు. 2014లో ఒకే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదని, అది అసంభవమని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని, రెండు రాష్ట్రాల్లోనే ఎన్నికలు జరుగుతాయని జైపాల్‌రెడ్డి చెప్పారు. హైదరాబాదు రెవెన్యూను ఇరు ప్రాంతాలకు పంపించాలనే విషయం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ కొరత ఏర్పడనున్న నేపథ్యంలో పాత పద్ధతిని పదేళ్ల పాటు కొనసాగించాలని జివోఎంను కోరినట్లు చెప్పారు. జీవోఎం అడిగిన అంశాలపై నివేదిక తయారు చేసి అందజేశామని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రాలు విడిపోయినప్పుడు లేని అభ్యంతరాలు ఆంక్షలు తెలంగాణ విషయంలో పెట్టడం సరికాదని జివోంకు స్పష్టం చేశామన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఐదేళ్ళు సరిపోతుందని, వెంటనే కొత్త రాజధానికి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. హైదరాబాద్‌పై ఆంక్షలు సహించబోమన్నారు. హైదరాబాదులో, తెలంగాణలో ఉండే సీమాంధ్ర ప్రజల భద్రత బాధ్యత తమ పైన ఉందని సర్వే సత్యనారాయణ అన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని లేదన్నారు. అలాంటిది తాము ఉమ్మడికి అంగీకరించినట్లు చెప్పారు.కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం మేరకే కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేస్తోందని సర్వే కేంద్ర మంత్రి సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసమే కాదని ప్రత్యేకాంధ్ర కోసం కూడా ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష 10 జిల్లాలతో కూడిన తెలంగాణ అని సర్వే సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి రాజధాని అన్న అంశం దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. సోనియా మాటను గౌరవించి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఒప్పుకుంటామని సర్వే తెలిపారు. ఉమ్మడి రాజధాని పరిధి కూడా జీహెచ్ఎంసీ వరకే ఉండాలని ఆయన చెప్పారు. డిసెంబర్ చివరినాటికి పక్రియ పూర్తి చేయాలని కోరినట్లు సర్వే తెలిపారు. కేంద్రమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ భద్రాచలంను తెలంగాణలో భాగంగానే కొనసాగించాలని కోరినట్లు చెప్పారు. తాము హైదరాబాదు, భద్రాచలంతో కూడిన పది జిల్లాల తెలంగాణను కోరుకుంటున్నామని చెప్పారు. భద్రాచలం డివిజన్ ఖమ్మం జిల్లాలో అంతర్భాగమన్నారు. ఇది మహబూబాద్ నియోజకవర్గంలో ఉందన్నారు. విడిపోతే అక్కడున్న గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. అందుకే ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ కావాలన్నారు. హైదరాబాదు పైన ఎలాంటి ఆంక్షలు విధించవద్దన్నారు. తెలంగాణ గోదావరి నది పైన ట్రైబ్యునల్ అవసరం లేదన్నారు. 371డిని కొనసాగించాలని ఇరు ప్రాంత ఉద్యోగులు కోరుతున్నారన్నారు. దానిని సవరించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని చెప్పారు. హైదరాబాదు పైన కృత్రిమ ఆంక్షలతో ప్రయోజనం లేదని చెప్పినట్లు తెలిపారు. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ నుంచి వేరు చేసేందుకు గిరిజనులు ఒప్పుకోరని కేంద్రమంత్రి బలరాంనాయక్ అన్నారు. భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందన్నారు. భద్రాచలాన్ని సీమాంద్రలో కలిపేందుకు స్థానికులు ఒప్పుకోరని ఆయన తెలిపారు. వారికి అన్యాయం జరిగితే స్థానికులు ఒప్పుకోరని అన్నారు. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణలోనే ఉండాలని జీవోఎంకు నివేదిక ఇచ్చినట్లు బలరాం నాయక్ పేర్కొన్నారు.
భద్రాచలంతో సహా పది జిల్లాల తెలంగాణే




