Tuesday, 3 November 2026

సరిహద్దులు దాటి దురాక్రమణకు కుట్ర

భద్రాచలంపై కిరికిరి పెడితే మరో పోరుకు సిద్ధం : దేవీప్రసాద్‌
కరీంనగర్‌, నవంబర్‌ 19(జనంసాక్షి) :
సరిహద్దులు దాటి తెలంగాణ ప్రాంత దురాక్రమణకు సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఆరోపించారు. సీమాంధ్రులు ఆదిపత్య భావాజాలంతో తెలంగాణ ప్రజల మనోభావాలకు భిన్నంగా సరిహద్దుల సవరణ చేస్తూ దురాక్రమణకు దిగుతున్నారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని టీఎన్‌జీవో ఫంక్షన్‌హాల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పదిజిల్లాల సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భౌగోళికంగా మాకు కానిది ఇంచు భూమి కూడా అవసరం లేదని అన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని దీనిని ఎవ్వరు విడదీయలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. భద్రాచలంపై ప్రేమతో ఈ ప్రాంతం కోరడంలేదని పోలవరం ప్రాజెక్టు కట్టి భద్రాద్రి రాముడిని లక్షలాదిమంది గిరిజనులను ముంచడానికి చేస్తున్న కుట్రలుగా ఆరోపించారు. మేధాపాట్కర్‌ ఓవైపు పెద్దప్రాజెక్టులు వద్దని చెబుతున్నా పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చడానికి సీమాంధ్రలు ససేమిరా అంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి మూర్ఖపు వాదనలతో ఏపీఎన్‌జివోలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జోనల్‌ సమస్యలు, ప్రమోషన్లు వంటివాటిలో సమస్యలు తలెత్తుతాయని చెప్పుతూ ఏపీఎన్‌జివోలను సమ్మెకు పురికొల్పుతున్నాడని ఆరోపించారు. సుప్రింకోర్టు ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేకంగా వేసిన వాజ్యాలను కొట్టివేస్తే కూడా మీడియాతో సహా సీమాంధ్రనేతలు వక్రభాష్యాలతో ఇంకా అక్కడి సామాన్య ప్రజల మనోభావాలు రెచ్చగొట్టి అన్యాయం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పయ్యావుల కేశవ్‌ వంటి నాయకులు సుప్రింకోర్టులో కేసులు వేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై దాడులు చేస్తున్నారని దీనిని మేం తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై దాడిగానే భావిస్తామని అన్నారు. ఒక ఆర్థిక నేరస్తుడు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను కలిసి ఆర్టికల్‌ మూడుకు సరవణలు చేయాలని కోరుతున్నారని అన్నారు. అంబేద్కర్‌ బలహీనులకు రక్షణగా వుండేందుకు ఆధిపత్యధోరణి అణచివేసేందుకు తెచ్చిన ఆర్టికల్‌ 3కు సవరణ చేయాలని ఆయన కోరడం రాజ్యాంగ స్ఫూర్తిని బలహీనపరచడమేనని ఆయన అభివర్ణించారు. అక్రమంగా ఉద్యోగాల్లో కొనసాగుతున్న సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణను వదిలిపోవాల్సిందేనని వారిని ఎట్టిపరిస్థితుల్లో కేంద్రం ఇక్కడ వుంచేందుకు నిర్ణయం తీసుకున్నా తాము అంగీకరించమన్నారు. తెలంగాణ వాసుల ఉద్యోగాలు ప్రాంతీయేతరులు కొల్లగొడుతున్నారని జీవో 36, 610, గిరిగ్లాని కమిషన్‌ ఏకసభ్య కమిషన్‌ కూడా చెప్పిందని గుర్తుచేశారు. విభజనతో సంబంధం లేకుండానే ప్రాంతీయేతర ఉద్యోగులను వెనక్కి పంపాలని న్యాయమైన డిమాండ్‌ చేశామని తెలిపారు. సమావేశంలో పాలం రవీందర్‌రెడ్డి, వేణుమాధవ్‌, ఎంఏ హమీద్‌, నర్సింహాచారి, శ్రీనివాసచారి, గాజుల నర్సయ్య, ఎస్‌కే చాంద్‌, ప్రభాకర్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *