Tuesday, 3 November 2026

నెలాఖరుకే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు : బొత్స

హైదరాబాద్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లును ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి పంపిస్తామని సమన్వయ కమిటీ భేటీలోనే ఆంధప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పారని ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీకి బిల్లు ఈ నెలలోనే వస్తుందనే విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిల ఎదుటే డిగ్గీ చెప్పారన్నారు. బిల్లు నెలాఖరుకు రానుందని బొత్స మంగళవారం ఇక్కడ చెప్పారు. రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ సూచించిందని అయితే కిరణ్‌ మాత్రం మండల కేంద్రాల్లో నిర్వహించాలని నిర్ణయించారన్నారు. మంత్రి బాలరాజు వ్యవహారంలో సమాచార లోపం ఉందన్నారు. సీఎం కార్యాలయానికి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజుల మధ్య సమాచారం లోపం ఉందని బొత్స అభిప్రాయపడ్డారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సీఎం కిరణ్‌ విశాఖలో పలు గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమాలపై సీఎం కార్యాలయం తనకు సమాచారం అందించలేదని మంత్రి పి.బాలరాజు మీడియా సమావేశంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖ జిల్లా కిరణ్‌ రచ్చబండ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని బాలరాజు చెప్పిన విషయం తెలిసిందే. గాంధీ భవన్‌లోని ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రాక పోవడంపై బొత్స స్పందించారు. కిరణ్‌ నిన్నటి వరకు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నందున తాము ఆయనను ఆహ్వానించలేకపోయామని ఈ కారణంగానే ఆయన రాలేదన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం గ్రామాల్లో నిర్వహించాలని మొదట్లో తామంతా అనుకున్నామని తెలిపారు. అయితే రచ్చబండ కార్యక్రమం మండల కేంద్రాల్లో నిర్వహించాలని తమతో సీఎం కిరణ్‌ సూచించారని, దాంతో ఆ కార్యక్రమాన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *