నష్టమో.. కష్టమో.. మేమే భరిస్తాం

మా గురించి నువు పట్టించుకోవాల్సిన పనిలేదు
కిరణ్‌కు కోదండరామ్‌ చురక
తెలంగాణ పునర్నిర్మాణంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కీలకం
కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌
దోచుకునేందుకే కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ
హైదరాబాద్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) :
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కష్టమో.. నష్టమో మేమే భరించుకుంటామని, మా గురించి నువు పట్టించుకోవాల్సిన పనిలేదని’ టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చురకలంటించారు. నగరంలోని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో నిర్వహించిన తెలంగాణ ఉద్యోగుల సమావేశంలో కోదండరామ్‌ పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోతే తెలంగాణ ప్రాంతానికే నష్టమంటూ ముఖ్యమంత్రి దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని, ఆయన సానుభూతి ఎవరికి అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ నగరం కాలుష్య కాసారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక పునర్నిర్మాణంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కీలక పాత్ర పోషించాలని అభిలషించారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువులు, నదులు కాలుష్యకోరల్లో చిక్కుకున్నాయని, పరిశ్రమల వ్యర్థాలు భూమిని, నీటిని పాడు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల వల్ల కూడా కాలుష్యం పెరిగిపోతుందని, వీటి నివారణకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టి కాలుష్య రహిత హైదరాబాద్‌ను నిర్మించడమే మన లక్ష్యం కావాలన్నారు. దోచుకునేందుకే ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. శ్రమించే వారి జీతాలు కాంట్రాక్టర్ల చేతిలో పోస్తే వారికి ఇష్టం వచ్చినంత ఇచ్చి మిగతాది దిగమింగుతున్నారని తెలిపారు. జీతభత్యాలపై ఖర్చు తగ్గించి పెట్టుబడిదారుల జేబులు నింపేందుకే ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం సాకారం అయిన వేళ దోపిడీ విధానాల రద్దుకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరితరమూ కాదని, కానీ హైదరాబాద్‌పై కొర్రీలు పెట్టి, తెలంగాణానే అడ్డుకునే శక్తులు వేగంగా పావులు కదుపుతున్న దృష్ట్యా మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.