Tuesday, 3 November 2026

ఛత్తీస్‌గఢ్‌లో 75 శాతం పోలింగ్‌

రాయ్‌పూర్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) :
ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ మలివిడత పోలింగ్‌ 75 శాతంగా నమోదైంది. ఎన్నికల సందర్భంగా భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. సాజా నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద భద్రతా సిబ్బందికి, ఓటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా, ఒకరు మృతి చెందారు. బిందర్‌వానీ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌కు మద్యం తాగిన వ్యక్తులు తరచూ వచ్చి గొడవ చేశారని, వారిని చెదగొట్టేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరపాల్సి వచ్చిందని డీజీపీ రాంనివాస్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు జరిగిన తుది దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం సాయంత్రం వరకు నాలుగు మిలియన్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్‌ బూత్ల వద్ద బారులు తీరగా, మరికొన్ని చోట్ల చాలా అత్యల్పంగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కుమారుడు అమిత్‌ జోగి బరిలో నిలిచిన మర్వాహి నియోజకవర్గంలో దాదాపు నలభై శాతానికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో బిలాస్పూర్‌ నగరంలో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మినహా రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోలేదు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. మహాసంముంద్‌ జిల్లాలోని సరైపల్లి నియోజకవర్గంలో ఓట్లర్లు అత్యల్పంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇదిలావుంటే ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం తథ్యమని కోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న అమిత్‌ జోగి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ 55-60 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. పదేళ్ల బీజేపీ దుష్ప్రరిపాలనకు ఛత్తీస్‌గఢ్‌ ఓటర్లు ముగింపు పలుకుతారని కాంగ్రెస్‌ నేత ఛత్తీస్‌గఢ్‌ తొలి ముఖ్యమంత్రి అజిత్‌ జోగి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఛత్తీస్‌గఢ్‌ రెండు, చివరి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికలు జరుగుతున్న 72 నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. ఇక అజిత్‌ జోగి, అమిత్‌ జోగి, ఆయన భార్య కోటలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *