Tuesday, 3 November 2026

పారాహుషార్‌ అసెంబ్లీ ప్రొరోగ్‌కు కిరికిరి రెడ్డి కుట్ర

వినకపోతే స్పీకర్‌పై అవిశ్వాసానికి ఎత్తుగడ
హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి) :
కేంద్రప్రభుత్వం ఈనెలాఖరులోగా రాష్ట్రవిభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలని చూస్తున్న తరుణంలో రాష్ట్ర అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయాలని స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌పై సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రోరోగ్‌ చేయకుండానే వదిలేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం విభజన బిల్లును చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం కావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ప్రోరోగ్‌ కాకపోవడంతో సిఎంతో సంబంధం లేకుండానే అసెంబ్లీ సమావేశాల తేదీని స్పీకర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో సిఎంకు ఏమాత్రం ప్రాధాన్యత లేక పోవడంతో కంగుతిన్న సిఎం ఎలాగైనా సరే ప్రోరోగ్‌ చేస్తే రాష్ట్ర విభజన ప్రక్రియ మరింత సమయం ఆగే అవకాశాలుంటాయని కుటిలయత్నానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. అయితే స్పీకర్‌ మాత్రం సిఎం మాటను ఏమాత్రం ఖాతరు చేయడం లేదని సమాచారం. తాను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు చెప్పినట్టే నడుచుకుంటానని పేర్కొనడంతో ఏం చేయాలో దిక్కుతోచని సిఎం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాణం పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు చెపుతున్నారు. ఇంతకాలం విభజనను అడ్డుకునేందుకు గాను నక్సలైట్లు, విద్య, మతకల్లోలాలు పెరుగుతాయని, నదులు ప్రవహించే తీరుపైన, 371డిపైన ఇలా అనేకానేక కారణాలతో అడ్డుకునేందుకు కుట్ర పన్నుతూ రాగ అన్నింటిని కేంద్రం ప్రభుత్వం తుంగలో తొక్కింది. చిట్టచివరిగా ఏకంగా అసెంబ్లీకి బిల్లు రాకుండా ఉండేందుకు ఈవిధంగా సమావేశాన్నే నిర్వహించకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని లీకులు ఇచ్చి సీమాంధ్ర చానళ్లలోను, పత్రికల్లో వార్తలు అనుకూలంగా రాయించుకుంటూనే ఉన్నారు. నిన్నటికి నిన్న భద్రాచలం, మునగాల తదితర ప్రాంతాలు సీమాంధ్రకే చెందుతాయని వార్తలు రాయించుకోగా, తాజాగా స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లుగా లీకులిచ్చి పైశాచికానందం పొందుతున్నారని అటు అధికారులు, ఇటు తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ప్రోరోగ్‌ విషయం స్పీకర్‌ నిర్ణయాధికారం పరిధిలోకే వస్తుందని మాజీ స్పీకర్‌ టిడిపి సీనియర్‌ నేత కూడా పేర్కొనటం శుభ సూచకం. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్మాణస్థలం రికార్డుల ప్రకారం సీమాంధ్రకు చెందినవేనని తప్పుడు నివేదికలు రూపొందించి ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామా లేపారు. అయితే వారిచ్చిన సమాచారంమేరకు వివిదపత్రికలు, చానల్లు వార్తలురాయడం, కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు స్పందించి తాము ఎప్పుడిచ్చాం బాబోయ్‌ అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వార్తలకు, సీమాంధ్ర నేతల ప్రయత్నాలకు తాము బలి కాదలుచుకోలేదని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ హైదరాబాద్‌లో కూడా అందుబాటులో లేనేలేరు. దీంతో సిఎం చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా విఫలం అవుతుండడంతో ప్రజల్లో పలుచనవుతున్నాడు. అటు సీమాంధ్రలోను, ఇటు తెలంగాణలో కూడా ఒక పరువు కోల్పోయిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడని పరిశీలకులు పేర్కొంటున్నారు. చిట్టచివరి ప్రయత్నం అయిన అసెంబ్లీ ప్రోరోగ్‌తోపాటు స్పీకర్‌పై అవిశ్వాసం ప్రయత్నం కూడా బెడిసి కొట్టే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈసమయంలో స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చి బిల్లును రాకుండా అడ్డుకోవడం దుర్మార్గమే అవుతుందని తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు. చిట్టచివి అవకాశాన్ని కూడా సిఎం కోల్పోవడంతో ఇప్పుడేం చేస్తాడో చూస్తామని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *