సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయం మేరకే జీవోఎం నివేదిక

కేంద్ర హోం శాఖ మంత్రి షిండే
న్యూఢిల్లీ, నవంబర్‌ 21 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, యూపీఏ నిర్ణయం మేరకే జీవోఎం నివేదిక సమర్పిస్తుందని, సాధ్యమైనంత త్వరలో తెలంగాణ పక్రియను పూర్తి చేస్తామని కేంద్ర ¬ంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెల్లడించారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం గురువారం నార్త్‌బ్లాక్‌లో సమావేశమై చర్చించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే వారం మరోసారి జీవోఎం సమావేశమవుతుందని ఆయన పేర్కొన్నారు. జీవోఎం త్వరలో తుది నివేదికను ఖరారు చేస్తుందని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం విదేశాల్లో ఉన్నందున ఇవాళ్టి సమావేశానికి హాజరు కాలేక పోయారని తెలిపారు. ఇదిలావుంటే తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కొత్తరాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌ రెడ్డి కోరారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి విభేదాలు రావన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సీట్లకు అనుగుణంగా అసెంబ్లీ సీట్లు పెంచాలన్నారు. ఈ మేరకు కేంద్ర ¬ంమంత్రి, కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సారథి సుశీల్‌ కుమార్‌ షిండేకి ఆయన లేఖ రాశారు. తెలంగాణ పరిధిలో 17 లోక్‌సభ సీట్లు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని రాజకీయ అస్థిరతకు ఆస్కారం లేకుండా సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో రెండేసి చొప్పున అదనంగా 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు చేయాలని, దీనితో సీట్ల సంఖ్య 153కు పెరుగుతుందని తన లేఖలో తెలిపారు. రాష్ట్ర విభజనపై తుది నివేదిక విషయంలో జీవోఎం చర్చలు జరుపుతోంది. అయితే దీనిపై మరింత స్పష్టత కోసం శుక్రవారం మరోసారి సమావేశం కావాలని జీవోఎం సభ్యులు నిర్ణయించారు. రాష్ట్ర విభజన విధివిధానాలపై రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రిలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తిచేసిన జీవోఎం గురువారం కూడా విభజన నివేదిక ఖరారుపై కసరత్తు కొనసాగించింది. నివేదిక వచ్చేవారం కేంద్ర కేబినెట్‌ ముందుకు రానున్నట్లు సమాచారం.అయితే కేంద్రమంత్రి చిదంబరం సింగపూర్‌ వెళ్లడంతో తుది నివేదిక విషయంలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం జీవోఎం సభ్యులు కేంద్రమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే, నారాయణ స్వామి, జైరాం రమేష్తో కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం భేటీ అయ్యారు. కాగా జీవోఎం నివేదిక రూపకల్పన తుది దశకు చేరుకోవటంతో సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్యాకేజీల కోసం తాము చేసిన డిమాండ్లను అందులో పొందుపరిచేలా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీమాంధ్రకు అన్యాయం చేయవద్దని వారు కోరినట్లు సమాచారం. కేంద్రం ముందు ప్రకటించిన ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితేనే పార్లమెంటు ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు సమయం సరిపోయే పరిస్థితిలేదు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) తుది నివేదిక ఇచ్చినప్పటికీ రాజ్యాంగం ప్రకారం జరగవలసిన పక్రియ జరగవలసింది ఇంకావుంది. కాంగ్రెస్‌ అధిష్టానం నేతలు చెప్పిన ప్రకారం అయితే గురువారం కేంద్ర కేబినెట్‌ తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపవలసి ఉంది. ఆ తరువాత రాష్ట్రపతి దానిని శాసనసభకు పంపడం ఆ తరువాత శాసనసభ అభిప్రాయం రాష్ట్రపతికి పంపడం రాష్ట్రపతి దానిని కేంద్రానికి పంపడం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడం ప్రాముఖ్యత గల బిల్లు అయినందున సుదీర్ఘ చర్చ అంతా బిజీ షెడ్యూల్‌ ప్రకారం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితేనే బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉండేది. కేంద్ర కేబినెట్‌ సమావేశం వాయిదాపడిన నేపధ్యంలో ఓ ఆటంకం ఏర్పడినట్లే భావించాలి. ఓ రకంగా ఇది కొంత వెనక్కి పోయినట్లుగా భావిస్తున్నారు. ఈ నెలాఖరుకు కేంద్ర కేబినెట్‌ బిల్లు ఆమోదించినా మిగిలిన అన్ని పక్రియలు పూర్తి అయి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి గానీ, చర్చకు గానీ సమయం సరిపోదు. పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 5న ప్రారంభమై 20న ముగుస్తాయి. దీంతో ఈ లోగా ముగుస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ఇచ్చే సమయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్గఢ్‌ రాష్టాల్రు ఏర్పడినప్పుడు 45 రోజులు సమయం ఇచ్చారు. బిల్లు ఈ సమావేశాల్లో పార్లమెంటుకు రావడం అనేది రాష్ట్రపతి శాసనసభకు ఇచ్చే సమయంపై ఆధారపడి ఉంటుంది. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతుండటం విభజనకు అనేక సమస్యలు ఉన్న నేపధ్యంలో ప్రాముఖ్యత గల ఈ బిల్లుపై శాసనసభ చర్చించడానికి, అభిప్రాయం తెలియజేయడానికి కనీస సమయం ఇచ్చే అవకాశం ఉంది.