Tuesday, 3 November 2026

తీరం దాటనున్న హెలెన్‌ తుపాను

మచిలీపట్నం వద్ద పొంచి ఉన్న ప్రమాదం
సీఎం ఉన్నత స్థాయి సమీక్ష
విశాఖపట్టణం, నవంబర్‌ 21 (జనంసాక్షి) :
హెలెన్‌ తుపాను రానున్న 24 గంటల్లో తీరం దాటనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘హెలెన్‌’ తుపాను క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. అయితే ప్రస్తుతం ఇది నిలకడగా ఉందని తెలుస్తోంది. ఇది మరింత బలపడి రాగల 24గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుపాను ప్రస్తుతం చెన్నైకి తూర్పు-ఈశాన్య దిశలో 460 కిలోమీటర్లు, ఒంగోలుకు తూర్పు దిశలో 360 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 260, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయ దిశలో 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఒంగోలుకు సమీపంలో రేపు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఇవాల్టి నుంచి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో, రేపటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నంలో మూడోనంబరు, కృష్ణపట్నం ఓడరేవులో ఐదో నంబరు, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో ఆరో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో విశాఖలో భారీ వర్షం కురిసింది. రాజమండ్రిలో ఉదయం నుంచి జల్లులు పడుతున్నాయి. దీని ముప్పు నుంచి ఇంకా తప్పుకోక ముందే అండమాన్‌ సముద్రం పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, అల్పపీడనం ఏర్పడిన తర్వాత మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హెలెన్‌ తుపాను రేపు ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య ఒంగోలు వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో నెల్లూరు జిల్లా యంత్రాంగా అప్రమత్తమైంది. తీర ప్రాంతంలోని 12 మండలాల్లో 69 గ్రామాలను లోతట్టు ప్రాంతాలుగా గుర్తించి, ఏడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రెండు విపత్తు నిర్వహణ దళాలు జిల్లాకు చేరుకున్నాయి. నెల్లూరు కలెక్టరేట్‌లో తుపాను సహాయ చర్యల కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సహాయ చర్యల కోసం 0861-233 1477, 233 1261నంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. హెలెన్‌ తుపాను దృష్ట్యా ప్రకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లోని 11 మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని 28గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. తుపాను అప్రమత్తత, సమాచారంపై కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమాచారం కోసం కలెక్టరేట్‌లోని 08592-281400నంబరు కు ఫోన్‌ చేయాలని సూచించారు. తుపాను నేపథ్యంలో జిల్లాకు 80 మంది సభ్యుల ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం చేరుకుంది. కొత్తపట్నం వద్ద సముద్ర అలలు ఎగిసి పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2వేల మరపడవలు, 2,100 తెప్పలు, 24 పెద్ద పడవలు వేటకు దూరంగా ఉన్నాయి. హెలెన్‌ తుపానుతో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. తుపాను సమాచారం, సహాయ చర్యల కోసం 0884 236 5506 నంబరుకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. రాజమండ్రిలో ఈ ఉదయం నుంచి జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉప్పాడ వద్ద సముద్ర అలల తాకిడికి రక్షణగోడ ధ్వంసమైంది. దీంతో బీచ్‌రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ గ్రావిూణ మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో చిక్కుకుంది. ఈనెల 18న ఏడుగురు మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లారు. అయితే బుధవారం నుంచి తుపాను కారణంగా అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బోటు మరమ్మతులకు గురైనట్లు స్థానికులకు సమాచార మందించారు. అప్పటి నుంచి మెరైన్‌ పోలీసులు, కోస్ట్‌గార్డు సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదని బంధువులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలని బాధితులు కోరుతున్నారు. కృష్ణాజిల్లా మంచిలీపట్నం వద్ద సముద్ర తీరంలో మత్స్యకారుల బోటు చిక్కుకుంది. ఈ బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. హెలెన్‌ తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన సహాయ చర్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *