తెలంగాణ రాష్ట్రానికే నగర పాలనాపగ్గాలు
అతివాద ప్రభుత్వాలొస్తే మైనార్టీలను వేధిస్తారు
సోనియాను కలిసి విన్నవించిన అసదుద్దీన్
న్యూఢిల్లీ, నవంబర్ 22 (జనంసాక్షి) : హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేయొద్దని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని మన్మోహన్సింగ్ కలిసి కోరానని తెలిపారు. అలాగే ఒక రాష్ట్ర రాజధాని మరో రాష్ట్రంలో ఉండడం కూడా తగదన్నారు. సోనియాను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌పై కేంద్ర మంత్రుల బృందానికి ఇచ్చిన లేఖనే సోనియాకు మరోసారి ఇచ్చానని తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ చేసే సీమాంధ్రులకు ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపామన్నారు. ఖైరతాబాద్ మండలాన్ని మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేస్తే సరిపోతుందని తెలిపామన్నారు. శాంతి భద్రతలు, రెవెన్యూ తెలంగాణ ప్రభుత్వం అధీనంలో ఉండాలని కోరామన్నారు. మతతత్వ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే మైనారిటీలకు, దళితులకు తీవ్ర నష్టం జరుగుతుందని విజ్ఞప్తి చేశామన్నారు. అంతకుముందు అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. వీరి ఇరువురి భేటీ సుమారు 45 నిమిషాలు పాటు కొనసాగింది. భేటీ అనంతరం అసదుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దని సోనియాని కోరినట్లు తెలిపారు. అవశేష ఆంధప్రదేశ్‌కు హైదరాబాద్‌తో భౌగోళిక సంబంధం లేదని అసద్ అన్నారు.శాంతి భద్రతలు, రెవిన్యూ, భూపరిపాలన రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దంటూ ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కోరనున్నట్లు అసదుద్దీన్ తెలిపారు. శనివారం వారిద్దరి అపాయింట్మెంట్ కోరానని…వారిని కలిసి ఇదే అంశాన్ని చెబుతానని అన్నారు. తొలి నుంచి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంత ప్రతిపాదనను ఎంఐఎం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఒక రాష్టాన్రికి చెందిన రాజధాని మరో రాష్ట్రంలో ఉండటం సరికాదని ఓవైసీ అన్నారు. మంత్రుల బృందానికి(జివోఎం)కు ఏ నివేదిక ఇచ్చానో సోనియాకు అదే ఇచ్చానని చెప్పారు. హైదరాబాదు ఉమ్మడి రాజధానికి అంగీకరించమన్నారు.
హైదరాబాద్ యూటీ చేయొద్దు




