పది మంది మృతి
భారీగా పంటనష్టం
లక్షల ఎకరాల్లో పంట నీటిపాటు
మచిలీపట్టణం/కాకినాడ/ఏలూరు, నవంబర్ 22 (జనంసాక్షి) :
హెలెన్ తుపాను ధాటికి కోస్తాంధ్ర అతలాకుతలం అయింది. రైతులకు భారీ నష్టం వాటిల్లింది. వివిధ ప్రమాదాల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. హెలెన్ తుపాను శుక్రవారం మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకింది. దీంతో మచిలీపట్నం వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మరోవైపు తీరప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. 90 నుంచి 100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హెలెన్తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరిపైరు నేలకొరిగింది. విశాఖ, కాకినాడలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయయ్యాయి. మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకిన హెలెన్ తుపాను చిత్రాలను ఇటీవల భారత్ ప్రయోగించిన మంగళ్యాన్ ఉపగ్రహం తీసింది. ఆంధప్రదేశ్‌లోని శ్రీహరికోటనుంచి ప్రయోగించిన ఈ ఉపగ్రహం తీసిన తొలిచిత్రం కూడా ఆంధప్రదేశ్‌కే సంబంధించింది కావడం విశేషం. బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా బలపడుతున్న చిత్రాన్ని నవంబరు 19న మధ్యాహ్నం సమయంలో మంగళ్యాన్ ఉపగ్రహం తీసింది. అప్పుడు ఉపగ్రహం భారత్‌కు 68,000 కి.మీల దూరంలో ఉంది. ఉపగ్రహం తీసుకెళ్లిన కెమెరాను శాస్త్రవేత్తలు పరీక్షిస్తుండగా కెమెరా కంటికి హెలెన్ తుపాను చిత్రం చిక్కింది. హెలెన్ తుపాను తీరాన్ని తాకింది. ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు దిశలో 15కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను ప్రభావంతో రాగల 12 గంటల వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి 100-120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. కోస్తాంధ్ర తీరంలో విూటరున్నర ఎత్తువరకు అలలు ఎగసిపడుతున్నాయి. తీరం దాటిన ఆరు గంటల్లో తుపాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా మారి, క్రమంగా కోస్తాంధ్ర, తెలంగాణ వైపు పయనించనుంది. కోస్తాంధ్రలో విస్తారంగా, తెలంగాణ, రాయలసీమల్లో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హెలెన్ తుపాన్ ప్రభావంతో నరసాపురం డివిజన్లోని 12 మండలాల్లో ఈదురుగాలులతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర మండలాలైన నరసాపురం, మొగల్తూరు మండలాల్లో తీవ్రస్థాయిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. ఈ రెండు మండలాల్లోనూ 40వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు సమాచారం. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇంతవరకు ప్రాణనష్టం జరిగిన సమాచారం డివిజన్ కేంద్రానికి అందలేదు.గోదావరి పరివాహక ప్రాంతమైన ఆచంట మండలంలో హెలెన్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం అర్ధరాత్రి నుంచి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో సుమారు పదివేల ఎకరాల్లో వరిపంట పూర్తిగా నేలకొరిగింది. ఆచంట, ఆచంట వేమవరం, వల్లూరు, కొడమంచిలి తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇళ్లపై భారీ వృక్షాలు పడటంతో ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. నిజాంపట్నం వద్ద చేపల వేటకు వెళ్లి గల్లంతిన ఆరుగురు మత్య్సకారులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నక్షత్ర నగర్ రేవుకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం వేటకు వెళ్లిన వారు శుక్రవారం ఉదయం వరకు రాకపోవడంతో హెలెన్ తుపాన్ నేపథ్యంలో కుటుంబాలు ఆందోళన చెందాయి. శుక్రవారం మధ్యాహ్నం వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో వారి కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. వల ఇరుక్కుపోవడంతో రాలేకపోయామని మత్య్సకారులు తెలిపారు.
హెలెన్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఇక్కడ పంటలు తీవ్రంగా నష్టం జరిగింది. అనేక చోట్ల పంటలతో పాటు విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి. లక్షన్నర హెక్టార్లలో వరి కోత దశలో ఉంది. మరికొన్ని చోట్ల చేలు కోతలు కోసి ఆరబెట్టుకున్నారు. ఈ పంటలన్నీ హెలెన్ తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు సర్వనాశనం అయిపోయాయని రైతులు అంటున్నారు. ఉప్పాడ కొత్తపల్లి వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. రోడ్డు మొత్తం కోతకు గురైంది. కాకినాడ-ఉప్పాడ మధ్య నాలుగు కిలోవిూటర్ల మేర ఉన్న రాక్ వే మొత్తం ధ్వంసమైంది. అలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో రోడ్డు మొత్తం కొట్టుకుపోయి రాళ్లు మాత్రమే మిగిలాయి. పది నుంచి పన్నెండు విూటర్ల ఎత్తు మేర అలలు ఎగసిపడుతున్నాయి.కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఆరుగురు మరణించారు. అమలాపురం రూరల్ వన్నెచింతలపూడిలో ఒకరు, ఉప్పలగుప్తం మండలం వాడపర్రులో ఒకరు, కాట్రేనికోన మండలంలో ఇద్దరు, ఐ.పోలవరం మండలం కొత్త మురముళ్లలో ఒకరు, కొత్తపేట మండలం గంటి చినపేటలో ఒకరు చొప్పున మరణించారు. గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు వంద కి.విూ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. చెట్ల, గుడిసెలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలకు అపార నష్టం వాటిల్లింది. అంతర్వేది వరకు ఉన్న తీరప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. 13 మండలాల పరిధిలో ఉన్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఆగిపోయారు. కాకినాడ హార్బర్ నుంచి ఐదు బోట్లలో వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. దాదాపు 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా గాలిద్దామనుకున్నా, వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో కోస్ట్‌గార్డ్ బృందాలు మాత్రమే గాలిస్తున్నాయి.
తుఫాన్ ప్రభావంపై సిఎం ఆరా
హెలెన్ తుపాన్ కారణంగా జిల్లాలో ప్రభావం తీవ్రంగా ఉంది. వేలాది ఎకరాల్లో వరి మునిగి పోయింది. అలాగే విద్యుత్ స్తంబాలు, చెట్టు నేలకొరిగాయి. దీని ప్రభావం మరింతగా ఉండనుంది. ఈదురుగాలులు, వర్షాలు పడుతున్నాయి. ఇదిలావుంటే ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్‌ను ఆదేశించారు. నరసాపురంలో ఉన్న కలెక్టర్‌కు శుక్రవారం ముఖ్యమంత్రి ఫోను చేసి తుపాను పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారుల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, జిల్లాలో 11 ఉచిత వైద్య శిబిరాలను, 11 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సుమారు 30వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా. పెనుమంట్ర తహశీల్దార్ సత్యనారాయణ శుక్రవారం తుపాను బాధిత ప్రాంతాలను పరిశీలిస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. తీర ప్రాంతాల్లో పరిస్థితులను జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్, జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో గురువారం అర్ధరాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
‘హెలెన్’ తుపాను నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో, జిల్లాలోని నాలుగు ఆర్డీవో, 8 తహసీల్దారు కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోలు రూములు ఏర్పాటు చేశారు. 8 మండలాల పరిధిలోని 37 గ్రామాలు తుపాను ప్రభావానికి లోనవుతాయని అధికారులు గుర్తించారు. ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏ ప్రాంతంలోని వారైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వీటికి ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.ఏ క్షణంలో అయినా తీరం దాటనుండడంతో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లాకు హెలెన్ తుపాను ముప్పు పొంచి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా, మండల స్థాయి ప్రత్యేకాధికార్లతో కలెక్టర్ మాట్లాడారు. తీరప్రాంతంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం మండలాల పరిధిలోని బియ్యపుతిప్ప, మర్రితిప్ప, దర్భరేవు, పీఎం లంక, లక్ష్మణెళిశ్వరం, కేపీ పాలెం, లోసరి, దొంగపిండి, నాయుడుపాలెం, వెదుర్లంక, వేములదీవి, వైవీ పాలెం ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఎనిమిది మండలాల్లో తుపాను ప్రభావం ఉంటుందని గుర్తించిన అధికార్లు వాటి పరిధిలోని గ్రామాల ప్రజలను పరిస్థిితిని బట్టి సురక్షితప్రాంతాలకు తరలించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. మరో పక్క నరసాపురం తీరంలో ఒక విూటరు ఎత్తు వరకూ అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గురువారం రాత్రికి వీటి ఉద్ధృతి పెరిగింది. పెదమైనవానిలంక ప్రాంతంలో సముద్రతీరం కోతకు గురికావడంతో చెట్లు నేలకొరిగాయి. జిల్లాలో 19 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ప్రధానంగా మొగల్తూరు, నరసాపురంలలో విస్తరించి ఉంది. ఈ రెండు మండలాల పరిధిలోని 12 గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. అధికవర్షాలు వరదలు, ముంచెత్తితే వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లోతట్టు ప్రాంతాల వారు సహకరించాలి : రఘువీరా
విజయవాడ : సీమాంధ్రలో ఏర్పడ్డ హెలైన్ తుఫాను కారణంగా నానా బీభత్సం కలిగే అవకాశాలున్నందున ప్రజలు అధికారులతో సహకరించాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కోరారు. ఆయనతుఫాను ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనేలా చూస్తున్నారు. ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తుఫాను హెచ్చరికలు స్వీకరించిన తర్వాత జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగానే ఉన్నారన్నారు. తుఫాను ప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇంకా అవసరమైనన్ని ప్రారంభించేందుకు అధికారులకు సూచించామన్నారు. మచిలీపట్నంలో సైతం 13 పునరావాస కేంద్రాలను నెలకొల్పడం జరిగిందన్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు గాను అధికారులు సిద్దంగా ఉన్నారన్నారు. అలాగే ప్రాణహాని కలుగకుండా ఉండేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయన్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకాదికారిని ఇప్పటికే నియమించడం జరిగిందన్నారు. మచిలీపట్నం లోతట్టు ప్రాంతాల్లోనే సుమారు 80వేల మంది ఉన్నారని సమాచారం ఉందన్నారు. ప్రతిఒక్కరుకూడా అధికారులతో సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచించారు. ఈకార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డుమెంబర్లు, సింగిల్‌విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రతిఒక్కరు పాలు పంచుకోవాలని రఘువీరా పేర్కొన్నారు. రెండుమూడు రోజులపాటు ప్రజలు, వివిద వర్గాలకు చెందిన వారు అధికారులకు సహకరిచాలని మంత్రి సూచించారు. ప్రతిపునరావాస కేంద్రంలో పాలు, పండ్లు, భోజనం సిద్దంగా ఉంచామన్నారు.
హెలెన్ ధాటికి కోస్తా అతలాకుతలం




