Tuesday, 3 November 2026

అసెంబ్లీ ప్రోరోగ్‌ ఎందుకు?

సీఎం నిర్ణయంతో విభేదించిన శ్రీధర్‌

ప్రవాసాంధ్రుల కోసం పోర్టల్‌ ప్రారంభం

హైదరాబాద్‌, నవంబరు 23 (జనంసాక్షి) :

అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయాల్సిన అవసరం ఏముందని శాసనసభ వ్యవహారాశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. మొన్నటి వరకు సీఎం కిరణ్‌కు సన్నిహితుడిగా పేరున్న శ్రీధర్‌ తెలంగాణ విషయంలో ఆయనతో విభేదించారు. శాసనసభ సమావేశాలు జరపడానికి గడువు తక్కువ కాలమే ఉండడంతో ఇప్పుడు ప్రోరోగ్‌ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, గవర్నర్‌ ఈఎల్‌ నరసింహన్‌లను కలసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ప్రోరోగ్‌ చేయడం ద్వారా తెలంగాణపై శాసనసభలో చర్చ ఆలస్యం చేయాలన్న ప్రయత్నాలు సరికావని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 25వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోను సభ సమావేశం కావాల్సి ఉందని, అందువల్ల ప్రోరోగ్‌ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అలాగే విదేశాలలో జీవనోపాధి కోసం రాష్ట్రం నుండి వెళ్లిన ప్రవాసాంధ్రుల సౌకర్యార్థం కోసం ప్రభుత్వం ఏపీ ఎన్‌ఆర్‌ఐ గవర్నెన్స్‌ డేటా సిస్టం పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్‌ను పౌర సరఫరాలు, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం సచివాలయంలో ప్రభుత్వ జిఎడి కార్యదర్శి శివశంకర్‌, ఎన్‌ఆర్‌ఐ విభాగం అదనపు కార్యదర్శి రమణారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాయిలెట్‌ ప్రాజెక్టు కింద మొదట హైదరాబాద్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, కడప, కర్నూలు జిల్లాల్లో దీనిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ పోర్టల్‌ ద్వారా విదేశాలకు వెళ్లిన, వెళ్లేవారు తమ వివరాలను నమోదు చేసుకున్నట్లయితే భవిష్యత్‌లో విదేశాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసుకోవడానికి వీలుంటుందని చెప్పారు. విదేశాలకు వెళ్ళినవారు, వెళ్లేవారు ఎక్కడికి వెళుతున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఏ కార్యాలయంలో పని చేస్తున్నారు వంటి వివరాలను పొందుపరచాలని మంత్రి కోరారు. దీనివల్ల ఆపద, విపత్తు సమయాలలో వారిని గుర్తించడం, స్వదేశానికి తీసుకురావడానికి వీలుంటుందన్నారు. ఈ పోర్టల్‌ ద్వారా విదేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని మంత్రి కోరారు. అలాగే ఈ పోర్టల్‌ను విదేశాలలోని తెలుగు సంఘాలకు అనుసంధానం చేస్తామని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులకు సంబంధించిన సమాచారం కూడా దీనిద్వారా పొందవచ్చునని చెప్పారు. ప్రవాసాంధ్రులు ఈ పోర్టల్‌ను చూసి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *