రైతు గుండె బరువు
లక్షల ఎకరాల్లో పంటనష్టం
20 మంది మృతి
హైదరాబాద్, నవంబరు 23 (జనంసాక్షి) :
హైలెన్ తుపాను దాటికి కోస్తా తీరమంతా చెరువుగా మారింది. రైతన్నలకు భారీ నష్టం వాటిల్లింది. ఐదు జిల్లాల్లో జనం అతలాకుతులం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా చనిపోయారని అధికార వర్గాలు చెబతుండగా.. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. హైలెన్ తీరం దాటినా అది వాయుగుండంగా మారి రాయలసీమ, తెలంగాణ మీదుగా కదులుతోంది. బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో మరో వాయుగుండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో అధికారులు మరింత అమ్రత్తమయ్యారు. ఇది అల్పపీడనంగా ఉన్నా.. బలపడి క్రమంగా వాయుగుండంగా మారి ఆ తర్వాత మరింత బలపడి తుపానుగా మారే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తీర ప్రాంతం వెంట ఈదురుగాలుల వేగం తగ్గినా సముద్రం నుండి అలలు మరో 12గంటల పాటు ఉంటుందని అధికారులు తేల్చారు. ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. కొబ్బరిచెట్టు, తాటి చెట్లు నేలకొరిగాయి. తూర్పు కోస్తా తీరంతో పెను విధ్వంసాన్నే సృష్టించింది. దాదాపు 73పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి తీరం వేట ఉన్న 16వేలమందిని అక్కడికి తరలించడంతో భారీగా ప్రాణనష్టం తప్పిపోయింది. ఈ ఐదు జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన వరిపంట అక్కరకు రాకుండా పోయింది. 1996లో వచ్చిన మాదిరిగా కోనసీమలో ప్రతి ఒక్కరికి ఆదాయ వనరుగా ఉన్న కొబ్బరి చెట్టు నేలకూలాయి. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరద ప్రాంతంలో గత48 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కూలిన చెట్లు, విరిగిన విద్యుత్ స్తంభాలతో కోస్తా విలవిలలాడుతోంది. రాత్రివేళ విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్లపై కూలడంతో అనేక చోట్ల ప్రమాదాలు కూడా జరిగినట్లు సమాచారం. అందంగా, చూపరులను ఆకట్టుకునేలా ఉండే కోనసీమ కకావికలమైంది. హైలెన్ పంజాతో తీరం గజగజలాడింది. కేంద్రం ముందస్తుగా చర్యలు తీసుకున్నా ప్రకృతి విలయం ముందు సహాయక చర్యలు బలాదూర్‌గా మారాయి. కేంద్ర విపత్తు నివారణ బృందం రంగంలోకి దిగింది. సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు, మంచినీరు సరఫరా చేస్తుండడంతో పాటు వరదల్లో చిక్కుకున్నవారిని రక్ష్షించే ప్రయత్నం చేస్తున్నారు. జనానికి కంటికి కునుకే కరువైంది. వాయుగుండం ప్రభావంతో ఐదు జిల్లాలతో పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా శనివారం భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, కొత్తపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, కృష్ణా జిల్లాల్లో హైలెన్ ప్రభావం విపరీతంగా కనిపించింది. ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అధికారులతో నిత్యం టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ విపత్తుల నివారణ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి సచివాలయం నుండి పరిస్థితి సమీక్షించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తుపాను ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుపానుగా మారితే పరిస్థితి మరింత విషమిస్తుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పట్లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు కూడా అవకాశాలు ఉండవని అధికారులు భావిస్తున్నారు. తీర ప్రాంతంలోని రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే, మరో 48గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, విపత్తు నివారణ కమిషనర్ పార్థసారధి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తుపాను సృష్టించిన బీభత్సం కోస్తాంధ్రను కోలుకుండా చేసింది.
రాష్ట్రంపై హెలెన్ తుపాన్ ప్రభావం ముగిసినట్లుగానే భావిస్తున్నామని విపత్తు నివారణ కమిషనర్ పార్థసారథి శనివారం సాయంత్రం సచివాలయంలో విలేకరులకు తెలిపారు. హెలెన్ ప్రభావం వల్ల ఊభయగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు మృతి చెందారని, దాదాపు మూడున్నర లక్షల హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. విద్యుత్, రోడ్ల పునరుద్దరణ పనులు రేపటి వరకు పూర్తి కాగలవని తెలిపారు. గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన 96 పునరావాస శిబిరాలను కూడా మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం ఉదయం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పార్థసారథి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన తొమ్మిది పడవలు 63 మంది మత్స్యకారులను సముద్రం నుండి కాపాడామని తెలిపారు. సహాయ పునరావాస చర్యలపై జిల్లాస్థాయిలో కలెక్టర్లు తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పంటల నష్టాలను రెండు రోజుల్లో ప్రాధమికంగా అంచనా వేస్తారని తెలిపారు. ఇప్పటివరకు 500 గ్రామాలకు విద్యుత్‌ను పునరుద్దరించామని, మరో 200 గ్రామాలకు పునరుద్దరించే చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు. రహదారులకు పడిన గండ్లను పూర్చడంతో గ్రామాలకు రవాణాను పునరుద్దరించే చర్యలు పూర్తి కావస్తున్నాయని పార్థసారథి తెలిపారు. కొబ్బరి, పత్తి, కాటన్, పండ్లతోటలు, కూరగాయ పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారన్నారు. నష్టాలపై త్వరలోనే ప్రాధమిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
‘హెలెన్’పై సమీక్షించిన ముఖ్యమంత్రి
హెలెన్ తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలవల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు ఇన్పుట్ సబ్సిడీని పెంచనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తుపాను బాధితులకు యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సహాయ చర్యల గురించి మంత్రులు తోట నరసింహం, వట్టి వసంత కుమార్, పితాని సత్యనారాయణ, కె.పార్థసారధిలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, తాగునీటి పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైనచోట నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. త్వరలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటిసారు. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించామని మహంతి తెలిపారు. ఐదు జిల్లాల్లో 346 ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 93 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 21,283 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు.





