అప్రమత్తంగా ఉండండి : పార్థసారధి
విశాఖపట్నం, నవంబర్ 24 (జనంసాక్షి)
హెలెన్ తుపాన్ బలహీన పడుతోందని ఊపిరి పీల్చుకున్న సమయంలోనే కోస్తా తీరప్రాంతంపై మరో భీకర తుపాను పొంచి ఉందని సమాచారం. దీనికి వాతావరణ శాఖ అధికారులు లెహర్‌గా నామకరణం చేశారు. నవంబర్ 28వ తేదీన మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే లెహర్ తుపాన్ ఈ సీజన్‌లో వచ్చిన అన్ని తుపానుల కంటే విధ్వంసం సృష్టించనుందని వాతా వరణశాఖ ప్రకటించింది. మరో 24గంటల్లో లెహర్ తీవ్ర రూపం దాల్చనుందని తెలిపింది. లెహర్ తుపాన్ అండ మాన్ సముద్రంపై నుంచి వాయువ్య దిశంగా పయనించి ఆదివారం సాయంత్రానికి పోర్టుబ్లెయిర్‌కు 230కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాత్రికి ఇది అండమాన్ నికోబార్ దీవులను దాటి పోర్ట్‌బ్లెయర్ సమీపంలోకి చేరనుందని, అనంతరం బంగాళాఖాతం ఆగ్నేయదిశలో పయనించి పెనుతుపాన్‌గా రూపొంది 28నాటికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ప్రాంతంలో తీరం దాటనుందని పేర్కొంది. ఈ తుపాన్ ప్రభావం కారణంగా మరో 48గంటల తర్వాతే రాష్ట్రంలో వర్షాలు మొదలవుతాయని 26నాటికి భారీ వర్షాలు తప్పవని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి తెలిపారు. లెహర్ తుపాన్ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం కోస్తా తీరంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఈ తుపాన్ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని జిల్లాల యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. 26-28 తేదీల్లో చేపల వేటకు సముద్రం మీదికి వెళ్లొద్దని మత్స్యకారులను కోరింది.
అప్రమత్తంగా ఉండాలి: పార్థసారధి
కోస్తా తీరానికి లెహర్ తుపాన్‌తో పెనుముప్పు పొంది ఉందని విపత్తుల నివారణ శాఖ కమిషనర్ పార్థసారధి హెచ్చరించారు. హెలెన్ తుపాను కంటే లెహర్ తుపాన్ చాలా తీవ్రమైనదని, చాలా జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని ఆయన హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకటి రెండు రోజుల్లో లెహర్ తుపాన్ కదలికలపై పూర్తి స్పష్టత వస్తుందని ఈ నెల 28న కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆయన హెచ్చరించారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు లెహర్ తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. గుడిసెలు, పెంకుటిళ్లలో నివసింటే తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పార్థసారధి విజ్ఞప్తి చేశారు.
తుపాన్ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు : జేపీ
హైదరాబాద్ : ఇటీవల రాష్ట్రంలో సంభవించిన నీలం, హెలెన్ తుపాన్ల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు ,కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సత్తా పార్టీ ఏడో మహాసభ ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తుపాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని, వెంటనే రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు, ఆందోళనలు చేయడం రాజకీయం కాదనీ, ప్రజా ఉద్యమాల బాట అంటే సమ్మేలు, బంద్‌లు చేయడం కాదని జేపీ వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమం అంటే ప్రభుత్వం విధానాలు మార్చేలా చేయడమేనని ఆయన అన్నారు.లోక్‌సత్తా పార్టీ పోరాటం వల్లనే ఆహార ధాన్యాల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలను తొలగించిందని జేపీ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది జాతీ విద్రోహమేనని ఆయన అన్నారు.
పొంచి ఉన్న లెహర్ పెను తుపాను




