శ్రీధర్‌బాబు సహకరించొద్దు
జేఏసీ చైర్మన్ కోదండరాం
కరీంనగర్, నవంబర్ 24 (జనంసాక్షి) :
అసెంబ్లీ ప్రొరోగ్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందని జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ప్రొరోగ్‌కు రాష్ట్రశాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకరించవద్దని సూచించారు. రాష్ట్రవిభజనకు 1955 తర్వాత అనుసరించిన సంప్రదాయలను తెలంగాణ ఏర్పాటులో ఆనుసరించాలని, కొత్తగా ఏ విధానం అనుసరించడం తగదని చెప్పారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవడం సంప్రదాయమని చెప్పారు. ముసాయిదా ప్రతిపాదన ఒకసారి, ముసాయిదా బిల్లు మరోసారి.. ఇలా అసెంబ్లీకి రెండు సార్లు పంపే సాంప్రదాయాన్ని 1955లోనే కేంద్రం తిలోదకాలు ఇచ్చిందన్నారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌ఘఢ్, జార్ఖండ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా అసెంబ్లీకి ముసాయిదా బిల్లు పంపి అభిప్రాయం కోరారని గుర్తు చేశారు. ఆర్టికల్ 3,4కు సవరణలు చేయాలని ఇప్పుడు కాదు గతంలో కేటీషా వంటి ప్రముఖులు కూడా వాదించారని, చివరకు అంబేద్కర్ పీడిత పక్షాలకు న్యాయం చేయాలంటే కేంద్రం వారికి బాసటగా నిలిచేందుకు ప్రస్తుత విధానం అనుసరించాలని గట్టిగా తనవాదన విన్పించారని చెప్పారు. 371 ఆర్టికల్ ఏ రకంగా తెలంగాణ విభజనకు అడ్డుకాదని అన్నారు. అసెంబ్లీ ప్రొరోగ్ చేసినా లేక సైనెడ్ చేసినా ఏం కాదని, కాలపరిమితిలోగా రాష్ట్రపతివిధించిన కాలపరిమితిలోగా తీర్మానం వెనక్కి పోకపోయినా బిల్లు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ చట్టసభలు ప్రొరోగ్ చేసినా ఆగదని చెప్పారు. తెలంగాణ మంత్రులు సీఎం ఏకపక్ష నిర్ణయాలపై నిలదీయాలని అన్నారు. ఈ ప్రాంత మంత్రులు తెలంగాణ అంటూ ఊరికే అనడం కాదని, ఆచరణలో చిత్తశుద్ధి చూపాలని కోరారు. ముఖ్యంగా శ్రీధర్‌బాబు తన చేతిలోనుంచి అసెంబ్లీ ప్రొరోగ్, సైనెడ్ చేసే దస్త్రాలను ముఖ్యమంత్రి ఒత్తిడిచేసినా పంపకుండా ఎదురు తిరుగాలని కోరారు. చంద్రబాబు, జగన్, ముఖ్యమంత్రికి రాజ్యాంగ ప్రక్రియపై అవగాహన లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. న్యాయవాద పట్టభద్రుడైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ్యాంగంపై అవగాహనలేని అజ్ఞాని అని విమర్శించారు. రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తానని ప్రమాణం చేసి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ముఖ్యమంత్రి మొత్తం వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాడని దుయ్యబట్టారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే ఆర్టికల్ 3కు కిరణ్ కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. సాగర్ ఎడమ కాలువపై గుత్తాధిపత్యం కోసం మునగాలపై, పోలవరం ప్రాజెక్టులో భద్రాచలం ముంచడానికి హైదరాబాద్‌లో అక్రమంగా దురాక్రమించిన విలువైన భూములను పరిరక్షణకోసం సీమాంధ్రులు వాటిపై వివాదం లేపుతున్నారని, ఆయా ప్రాంతాలపై అనుబంధం ప్రేమతో కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలుపుతోందని, ఎలాంటి అనుమానాలు లేవని, పేపర్లో వచ్చే వార్తలన్నీ నిజం కాదని విలేకరులు అడిగినప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సంపూర్ణ తెలంగాణ సాధనమే మా లక్ష్యం అని ఆయన అన్నారు. సమావేశంలో టీజేఏసీ జిల్లా కన్వీనర్ బొత్తా వెంకటమల్లయ్య, జక్కోజు వెంకటేశ్వర్లు, మర్రిశ్రీనివాస్‌యాదవ్, ఫయాజ్ అలీ, కటకం రమేశ్, ఆర్టీసీ జేఏసీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ప్రొరోగ్ అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులదే




