న్యూఢిల్లీ, నవంబర్ 24 (జనంసాక్షి) :
మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానున్నది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బిజెపి మధ్య ప్రధాన పోరు కాగా.. మిజోరంలో కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని 230అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 2,583 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాల్లో మరికొద్ది గంటల్లో పోలింగ్ ఆరంభం కానున్నది. మధ్యప్రదేశ్‌లో డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. మిజోరంలో డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది.
మధ్యప్రదేశ్‌లో..
హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అధికార బిజెపి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బుధ్ని, విదిశల నుండి పోటీ చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడి ప్రచారం నిర్వహించారు. గడచిన పదేళ్లల్లో పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. మరోమారు అవకాశమిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు.ఓటర్లను చైతన్యవంతులను చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభపడు తుందని కాంగ్రెస్‌పార్టీ నమ్మకంతో ఉంది. కాంగ్రెస్‌పార్టీ తరపున ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు.. అభివృద్ధి లేమిని ఎండగట్టారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కాంగ్రెస్ సీఎంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పదవి చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఆ పీఠాన్ని ఎవరు అధిష్టించనున్నది తేలాలంటే డిసెంబర్ 8వరకు వేచి చూడాల్సిందే! ఇదిలా ఉండగా 2008 ఎన్నికల్లో బిజెపి 143,కాంగ్రెస్ 71, బిఎస్‌పి 7, భారతీయ జనశక్తి 5 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.
మిజోరంలో..
మిజోరంలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం ఆరంభం కానున్నది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనున్నది. మొత్తం 142 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 6.91లక్షలమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు
మధ్యప్రదేశ్, మిజోరాంలలో నేడు పోలింగ్




