నేడు జీవోఎం కీలక భేటీ

తుది మెరుగులు దిద్దే అవకాశం
28న కేబినెట్‌కు బిల్లు
డిసెంబర్‌ 9న పార్లమెంట్‌కు..
న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం బుధవారం కీలక భేటీ కానుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై జీవోఎం నివేదికకు తుది మెరుగులు దిద్ది గురువారం కేబినెట్‌ ముందుకు తీసుకురానుంది. ఈ సమావేశంలో విభజనపై తుదికసరత్తు పూర్తి చేసి కేబినేట్‌కు బిల్లు పంపుతారని తెలుస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి డిజెంబర్‌ 9 నాటికి తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తేదీనే తెలంగాణ ఏర్పాటు దినంగా చేయబోతున్నట్లు సమాచారం. గతంలో చిదంబరం ప్రకటన కూడా 9న వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం సమావేశం బుధవారం నాటిదే చివరిది కానుంది. సాయంత్రం 4.30 గంటలకు జీవోఎం చివరి సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఈ సమావేశంలో చాలా అంశాలపై చర్చించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. విభజన తర్వాత ఏ ప్రాంతంవారికి ఇబ్బందులు కలుగకూడదనే తమ ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. అయితే మధ్యాహ్నం 2.30గంటలకే ఈ సమావేశం జరుగనుంది. బుధవారం పూర్తి స్థాయి సభ్యులతో జరిగే జీవోఎం భేటీ తెలంగాణకు పతాక సన్నివేశం కానుందని తెలుస్తోంది. దీనికి ఉపోద్ఘాతంగా మంగళవారం వివిధ ప్రాంతాల నేతలు ¬ంమంత్రి షిండేతో సమావేశమయ్యారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను కోట్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి తెచ్చారు. గురువారం కేబినెట్‌ సమావేశం ముందు నివేదిక ఉంచే విధంగా డెడ్‌లైన్‌ విధించుకున్న జీవోఎం ఊపిరి సలపని షెడ్యూలుతో సమావేశాల పరంపర కొనసాగిస్తున్నది. మరోవైపు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడాన్ని అందరం వ్యతిరేకిస్తామని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ఎలాంటి రాజ్యాంగ సవరణలు అవసరం లేకుండానే తెలంగాణ ఏర్పాటు చేసే అవకాశం ఉందని, వచ్చే శీతాకాల సమావేశాలు ముగిసే లోగానే తెలంగాణ ఏర్పాటుకు వీలుందని ఆయన పేర్కొన్నారు. సోమవారంనాడు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో జీవోఎం సభ్యులు భేటీ అయ్యారు. సాయంత్రం కేబినెట్‌ సమావేశం అనంతరం వారు నేరుగా 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి చేరుకున్నారు. గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించారు. మంత్రులు ఏకే ఆంటోనీ, షిండే, చిదంబరం, జైరాం రమేశ్‌తో పాటు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ప రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ చర్చల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరంపై చర్చ కూడా జరిగినట్లు తెలిసింది. చివరికి కేవలం ఐదారేళ్లయినా యూటీ చేస్తే చాలని కేంద్ర మంత్రులు జేడీ శీలం, కావూరి చేసిన ప్రతిపాదనను జీవోఎం సభ్యులు మేడమ్‌ ముందుంచినట్టు సమాచారం. ఇదే విషయాన్ని మంగళవారం మంత్రి జెడి శీలం తెలిపారు. రెండు రోజుల్లో బిల్లు పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారని సమాచారం. ఈ నెల 28 న కేబినెట్‌ సమావేశానికి ముసాయిదా బిల్లు పూర్తి కాపీ అందించాలనే గడువును దృష్టిలో ఉంచుకుని జీవోఎం స్పీడ్‌ పెంచింది. బిల్లు రూపకల్పనలో కీలక బాధ్యత తీసుకున్న జైరాం రమేశ్‌ మంగళవారం నార్త్‌బ్లాక్‌లో తనకప్పజెప్పిన పనిని పూర్తి చేసేపనిలో పడ్డారు. మరోవైపు న్యాయశాఖ, ఆర్థికశాఖ, ¬ం శాఖ అధికారులు, కార్యదర్శులు మంగళవారం పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు. 27న అధికారికంగా భేటీ అయ్యే జీవోఎం పూర్తి చేసిన ముసాయిదాపై సంతకం పెట్టి కేబినెట్‌కు అందించనున్నదని సమాచారం. తెలంగాణపై జీవోఎం బుధవారం జరిపేదే బహుశా చివరి సమావేశం కావొచ్చు. ఈ సమావేశంలోనే తుది సిఫారసులకు మంత్రుల బృందం ఆమోదముద్ర వేస్తుందని తెలుస్తోంది. దీనిని మరుసటి రోసు కేబినేట్‌కు పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. విభజన విషయంలో ముందుకు వచ్చిన వివిధ అంశాలకు సంబంధించి భద్రాచలం విషయం కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. అవసరమైతే ముంపు మండలాలను సీమాంధ్రకు అప్పగించి భద్రాచలాన్ని తెలంగాణలో కొనసాగిస్తారని తెలిసింది. 371 (డీ) విషయంలో ఇప్పటికే న్యాయ మంత్రిత్వ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాజ్యాంగ సవరణ అక్కరలేదని, వీలునుబట్టి కొనసాగించడమా లేదా అనే విషయాన్ని పార్లమెంటులో బిల్లు సందర్భంగా తేల్చవచ్చని సమాచారం. యూటీ ప్రతిపాదనను సోనియా తోసిపుచ్చిన నేపథ్యంలో ఇక హైదరాబాద్‌ను ఏం చేయాలనే విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచారు. అయితే ఉమ్మడి రాజధానిగా ఉంచే పక్షంలో దాని పరిధిని జీహెచ్‌ఎంసీకి పరిమితం చేసే విషయంలో ఏకాభిప్రాయం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్‌పై అధికారాలకు సంబంధించి జైపాల్‌ రెడ్డి కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. అందుకే ఆయన హైదరాబాద్‌ను యూటి చేసే విసయాన్నిఎవరూ అంగీకరించరని అన్నారు. అలాంటి ప్రతిపాదన రాదన్నారు. ఏ అధికారాలైనా బదలాయిస్తే రాజ్యాంగ సవరణ కన్నా అది తెలంగాణ కేబినెట్‌ ద్వారా తీర్మానంచేసి గవర్నర్‌కు పంపిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తవని ఆయన సూచించినట్టు తెలిసింది. అలాగే రాయల తెలంగాణ అంశాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని స్పష్టం చేసారు. అయితే జీవోఎంతో సోనియా భేటీలో సైతం రాయల తెలంగాణ ప్రతిపాదన రాలేదని తెలిసింది. పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానికి అభ్యంతరం లేదని జైపాల్‌ రెడ్డి అన్నారు.