న్యూఢిల్లీ, నవంబర్ 26 (జనంసాక్షి) :
సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు కోర్టు జీవితఖైదు విధించింది. ఆరుషి, హేమరాజ్ జంట హత్యల కేసులో నిందితులైన రాజేష్ తల్వార్ దంపతులపై ఘజియాబాద్ సీబీఐ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్‌లే ఈ హత్య చేశారని సీబీఐ చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు నిందితులకు శిక్ష విధించింది. జీవితఖైదుతో పాటు రాజేష్ తల్వార్‌కు రూ.18 వేలు, నుపుర్ తల్వార్‌కు రూ.15 వేలు జరిమానా విధించింది. హత్యల తర్వాత ఆధారాలు లేకుండా చేసినందుకు దంపతులిద్దరికీ మరో ఐదేళ్లు, ఎఫ్‌ఐఆర్ నమోదులో పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు రాజేష్ తల్వార్‌కు అదనంగా మరో ఏడాది అదనంగా శిక్ష విధించారు. కొందరిసాయంతో తల్వార్ దంపతులే జంట హత్యలకు పాల్పడ్డారని సీబీఐ న్యాయవాది కోర్టులో వాదించారు. వీరికి మరణశిక్ష విధించాలని సిబిఐ న్యాయవాది వాదించారు. అయితే జీవిత కైదు విధించాలని డిఫెన్స్ లాయర్ వాదించారు. హత్యల అనంతరం ఆధారాలు లేకుండా చేశారని పేర్కొన్నారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి తల్వార్ దంపతులను సోమవారమే దోషులుగా నిర్దరించారు. మంగళవారం ఇద్దరికీ జీవితఖైదు విధిస్తూ తుదితీర్పు వెల్లడించారు. ఇది అత్యంత అరుదైన కేసుగా పేర్కొన్న సీబీఐ దోషులకు మరణశిక్షే సరైందని వాదనలు వినిపించింది. అయితే శిక్ష తగ్గించాలని తల్వార్ దంపతుల తరుపు న్యాయవాది అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పు విన్న ఆరుషి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తామని వీరి తరఫు లాయర్ తెలిపారు.హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాగా పద్నాలుగేళ్ల తమ
కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో శిక్షల ఖరారుపై నేడు కూడా వాదనలు జరిగాయి. నోయిడాలోని వారి ఇంట్లో 2008 మే 15 రాత్రి జరిగిన ఈ జంట హత్యలకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడానికి సంబంధించి కూడా అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్‌లాల్ వారిని దోషులుగా పేర్కొన్నారు. దర్యాప్తు సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగిన ఈ కేసులో ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు సోమవారం తీర్పు వెలువడింది. హత్యలపై నోయిడా పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఐపీసీ సెక్షన్ 203 కింద ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. సంచలనం కలిగించిన ఆరుషి, హేమరాజ్ హత్య కేసులో తీర్పు వెలువడనున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆరుషి హత్యకేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు




