– కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
న్యూఢిల్లీ, నవంబర్ 26 (జనంసాక్షి) :
సీమాంధ్రకు కర్నూల్ రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో భేటీ అయిన ఆయన ఈమేరకు ఆయనకు విన్నవించారు. అదే సమయంలో రాయల తెలంగాణ అంశాన్ని పరిశీలించాలని కూడా కోరారు. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న కోట్ల ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. సీమకు చెందిన పలువురు ప్రముఖులు దీనికోసం చాపకింద నీరులా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమస్యలపై, ఇరు ప్రాంతాల స్వభావ, సరిహద్దులపై ఇంతవరకు స్పష్టత రాకపోయినా రాయల తెలంగాణ ప్రతిపాదన మాత్రం తరచుగా తెరపైకి వస్తోంది. హైదరాబాద్‌తో కూడిన పదిజిల్లాల తెలంగాణను సిడబ్ల్యుసిలో ఆమోదించిన తరువాత కూడా ఇలాంటి ప్రతిపాదన తరచుగా తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాయల తెలంగాణకు అస్కారం లేదని కాంగ్రెస్ అధిష్ఠానానికి దగ్గరగా ఉన్న నేతలు ఓవైపు ప్రకటిస్తుంటే మరోవైపు ఆ రకమైన ఆలోచన కూడా ఉందన్న సంకేతాలు కేంద్రంనుంచి వస్తుండటంతో అంతా వ్యూహం ప్రకారమే జరుగుతోందా అన్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ సవిూకరణల నేపథ్యంలో కొత్త పొత్తులకోసం, కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే మెజార్టీ సీట్లు కైవసం అన్న ఆలోచన దిశగా ఈ అంశం తెరపైకి వస్తోందా అన్న చర్చ సాగుతోంది. ఈ రాయల్ టి ప్రతిపాదన రోడ్ మ్యాప్ సందర్భంగా వచ్చినా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే చాలని కొందరు టీ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ ప్రతిపాదన పట్ల తెలంగాణలోనే మెజార్టీ నేతలు సుముఖంగా ఉన్నారని మాజీ మంత్రి జె.సి.దివాకర్‌రెడ్డి గతంలో పలుమార్లు ప్రకటించారు. మరోవైపు ఎఐఎం నేత అసదుద్దీన్‌ఓవైసీ కూడా రాయల తెలంగాణకు అనుకూలమని ప్రకటించారు. ఇటీవల ఆయన ప్రధాని మన్మోహన్, సోనియాగాంధీలను కలసిన తరవాతనే ఈ ప్రతిపాదన తెరపైకి రావడం గమనార్హం. అయితే ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజనను కాంగ్రెస్ హైకమాండ్ చేస్తోందని ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు పలుమార్లు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి ఇదే కోణంలోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచి స్తోందా అన్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది. అయితే రాయల తెలంగాణ ప్రతిపాదనను రాయలసీమ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిడబ్ల్యుసిలో నిర్ణయం తీసుకొనే వరకు రాయల తెలంగాణ అంశం తెరపైకి రాలేదు. అదిసాధ్యం కాని పక్షంలో సీమాంధ్రకు కర్నూల్‌ను రాజధాని చేయడమే రాయలసీమకు న్యాయం చేయడమని కోట్ల ప్రతిపాదించినట్లు తెలిసింది.
సీమాంధ్రకు కర్నూలు రాజధాని చేయండి




