రెండు రోజులు సెలవు
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
విశాఖపట్నం, నవంబర్ 27 (జనంసాక్షి) :
దిశ మార్చుకున్న లెహర్ తుపాను గురువారం మచిలీపట్నం వద్ద తీరం దాటనుంది. ఈ సమయంలో లెహర్ తీవ్ర ప్రభావం చూపనుంది.. సమాచార వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రానికి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు చేరుకున్నాయి. గురువారం మధ్యాహ్నం మచిలీపట్నం-అవనిగడ్డ మధ్య తీరందాటే అవకాశం ఉందన్నారు. అన్ని ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. లెహెర్ తుపాను చెన్నై దిశగా పయనిస్తున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. పోర్ట్ బ్లేయర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లెహెర్ తుపాను దిశ మార్పుకుంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనాకు వచ్చారు. గురువారం అర్ధరాత్రి నుంచి ఎల్లుండి ఉదయం పదిగంటల లోపు తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. గురువారం గంటకు 170నుంచి 200కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు 2, 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశం ఉందన్నారు. ఈ దశలో రోడ్డు, రైలు మార్గాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని సూచించారు. దిశ మార్చుకున్న లెహర్ పెను తుపాను మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని, అన్ని ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న ఈ తుపాను గంటకు 15 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. కాకినాడకు ఇది తూర్పు ఆగ్నేయ దిశలో 600కి.మీ. దూరంలో, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశలో 650కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. రేపు మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ జారీచేసిన ఆరెంజ్ మెసేజ్ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం నుంచి కోస్తాంధ్ర సహా యానాం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 65కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో 150 నుంచి 170కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో 100 నుంచి 120కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో 55నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముంది. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలావుంటే తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని తరలిస్తామని విపత్తు నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆర్మీ సిబ్బందిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నారు. కోస్ట్‌్‌గార్డ్, ఆర్మీ, వివిధ బలగాల నుంచి సహకారం ఉంటుందన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లాలో 8పడవలు, గుంటూరు జిల్లాలో 6 పడవలు ఇంకా తీరానికి రావాల్సి ఉందన్నారు. సహాయ చర్యల కోసం సైనికులు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉన్నారని వివరించారు.
విమానం సిద్ధం చేసిన యంత్రాంగం
ఏలూరు : లెహెర్ తుఫాను ముంచెత్తనుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాకేంద్రంలోని ఏలూరులో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో సుమారు 37 గ్రామాలపై ఈతుఫాను ప్రభావం చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల కోసం నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు, 500మంది ఆర్మీ ఫోర్స్‌ను రంగంలో సిద్దంగా ఉంచారు. అలాగే ఎట్టిపరిస్థితినైనా ఎదుర్కొనేందుకు హెలీకాప్టర్‌ను కూడా సిద్దంగా ఉంచారు. ఏలూరుతో పాటు నర్సాపురం, కొవ్వూర్‌లలో హెల్ప్‌లైన్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏదైనా సమాచారం కావాల్సివస్తే ఈనంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఏలూర్‌లో 08812- 230050, నర్సాపురంలో 08814-276699, కొవ్వూర్‌లో 08813-231488 నంబర్లలో సమాచారం ఇవ్వడం గాని పుచ్చుకోవడం కాని చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఎంత పెద్ద విపత్తునైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉన్నాం : పార్థసారథి
హైదరాబాద్ : లెహర్ తుపాన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్ పార్థసారథి అన్నారు. బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ తుపాను ప్రభావం అధికంగా ఉన్నప్రాంతాలకు ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని తరలిస్తున్నామని తెలిపారు. కోస్ట్‌గార్డ్ ఆర్మీ, అగ్నిమాపక సిబ్బందిని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని పార్థసారథి తెలిపారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ పట్టణాలలో లెహర్ తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ఆస్కారం ఉందని అన్నారు. తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపడుతున్నదని తెలిపారు. ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సముద్రంలోకి దాదాపు 58పడవలు చేపల వేటకు వెళ్ళాయని, అవి తిరిగి రావాల్సి ఉన్నాయని పార్థసారథి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 6 పడవలు సముద్రం నుంచి తిరిగి రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. తుపాను ప్రభావం లేదని ప్రజలు భావించరాదని అన్నారు. లెహర్ తుపాన్ పెనుతుపాన్‌గా మారే ప్రమాదం ఉందని అన్నారు. తీరం దాటే సమయంలో 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వాతావరణ శాఖ అధికారుల హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు తరలి రాని ప్రజలను పోలీసులు ఖాళీ చేయాల్సివస్తుందని అన్నారు. తుపాను ప్రభావం వల్ల చెట్లు విరిగి రోడ్లపై పడడం, ఇంటి పై కప్పులు ఎగిరిపోవడం వంటివి సంభవిస్తాయని అన్నారు. అయితే రోడ్లపై పడిన భారీ వృక్షాలను త్వరిత గతిన తొలగించి రాకపోకలకు అంతరాయం కలుగకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు పడవలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొని వివిధ బలగాల సహాయాన్ని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. సముద్రంలోకి మత్య్యకారులు వేటకు వెళ్ళవద్దని అన్నారు. లెహర్ తుపాన్ దారి మళ్లిందని, వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంపై పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
తీరం దాటనున్న లెహర్ తుపాను




