బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
అల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి
న్యూఢిల్లీ, నవంబర్ 29 (జనంసాక్షి) :
కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాకు గండిపండింది. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేలా కృష్ణా జిల్లాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పును శుక్రవారం వెలువరించింది. ఇప్పటికే నీటి అలభ్యతతో నానా కష్టాలు పడుతున్న రాష్ట్రానికి ఈ తీర్పు తీరని అశనిపాతం కానుంది. కృష్టా నికర జలాల్లో 1001 టీఎంసీల నుంచి 1005 టీఎంసీలకు పెంచేందుకు ట్రిబ్యునల్ సుముఖుత వ్యక్తం చేసింది. అలాగే ఆల్మట్టి ఎత్తును పెంచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. దీనిద్వారా ఇప్పటికే కృష్ణా బేసిన్లో తీరని కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆల్మట్టి రూపంలో మళ్లీ ప్రమాదం పొంచి ఉంది. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. ఆంధప్రదేశ్‌కు 1001 నుంచి 1005 టీఎంసీలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు కేటాయించింది. మధ్యంతర తీర్పులో పెద్దగా మార్పు లేకుండా బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పును వెల్లడించింది. ఆంధప్రదేశ్ వినతిని కేంద్రం ఏర్పాటు చేసే అథారిటీ పరిశీలిస్తుందని పేర్కొంది. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా ఆంధప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు చేపట్టింది. 2010 డిసెంబరులో ఇచ్చిన ట్రైబ్యునల్ తీర్పులో ఆంధప్రదేశ్ 14 సవరణలు కోరింది. కానీ బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఒక్క సవరణను కూడా పట్టించుకోలేదు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు ఆంధప్రదేశ్‌కు శరాఘాతమని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో రాష్ట్రానికి 1,2 నెలలు ఆలస్యంగా కృష్ణాజలాలు వచ్చే అవకాశముంది. ట్రైబ్యునల్ తీర్పును రద్దు చేసి రాష్ట్రానికి న్యాయం చేయగలిగింది సుప్రీంకోర్టు ఒక్కటేనని నిపుణులు చెబుతున్నారు. జలయజ్ఞం కింద కృష్ణా బేసిన్లో రూ.32 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నికర జలాలు, మిగులు జలాల్లో వాటాను రాష్ట్రం నష్టపోయింది. 2050 వరకు బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అమలులో ఉంటుంది. ట్రైబ్యునల్ తీర్పును స్వాగతిస్తున్నట్లు కర్ణాటక తరపు న్యాయవాది తెలిపారు. ఈ తీర్పు ద్వారా కర్ణాటక ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు కారణంగా ఆంధప్రదేశ్‌కు ఎదురుదెబ్బే తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను ట్రిబ్యునల్ పక్కనపెట్టింది. తుంగభద్ర జలాల్లో నాలుగు టీఎంసీల అదనపు జలాల కేటాయింపు మాత్రమే పెంపుకు అనుమతి ఇచ్చింది. ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీటిని తరలించవద్దని సూచించింది. అన్ని అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రైబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై రాష్ట్రం ట్రిబ్యునల్ ఎదుట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి.. వాటిని పరిగణలోకి తీసుకోకుండా కృష్ణ జలలాపై ట్రిబ్యునల్ ఈ తీర్పునిచ్చింది. దీంతో రాష్ట్రంలో కృష్ణ జలాలపై ఆధారపడిన రైతాంగం తీవ్రంగా నష్టపోనుంది. మరోవైపు రాష్ట్ర విభజన పక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పుకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలం
– విపక్షాల మండిపాటు
హైదరాబాద్ : బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు సరిగా వాదనలు వినిపించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా రాష్ట్రానికి రావాల్సి జలాలపై హక్కులను కోల్పోయామని ఆరోపించారు. ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాష్ట్ర విభజన సమస్యలో ఉన్న సర్కారు వాదనలు వినిపించడంపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. మంత్రివర్గం రెండుగా విడిపోవడం వల్లనే ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపంచలేకపోయారని అన్నారు. ప్రాంతాలవారీగా విడిపోయిన కేబినెట్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన పేర్కొన్నారు. ట్రైబ్యునల్ తీర్పుపై ఇప్పటికైన జోక్యం చేసుకోని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్బంగా నారాయణ విజ్ఞప్తి చేశారు. బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల ఆంధప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వెంటనే చొరవ తీసుకుని అఖిలపక్షం నేతలను ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. మొత్తంగా కృష్ణా జలాలపై నియమించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలైమందని నారాయణ అభివర్ణించారు.కృష్ణా జలాలను 65 శాతం నీటి లభ్యత ప్రామాణికంగా పంపిణీ చేయడం అన్యాయమని టిడిపి నేత, మాజీ నీటిపారుదల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ప్రపంచంలో ఏ నదికైనా 75 శాతం నీటి లభ్యతనే ప్రామాణికంగా తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇక్కడ అలాంటిదేదీ పాటించలదేన్నారు. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు రైతాంగానికి గొడ్డలి పెట్టని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రైబ్యునల్ ముందు సమర్థమైన వాదనలు వినిపించలేక పోయిందని, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మిగులు జలాలు అవసరం లేదని గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ లేఖరాశారని ఆయనదే ఈ పాపమని వ్యాఖ్యానించారు. కృష్ణాజలాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని గతంలో తాము డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.రాష్ట్రం బలమైన వాదనలు వినిపించక పోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ట్రైబ్యునల్ తీర్పు అనంతరం టిడిపి న్యాయవాది వ్యాఖ్యానించారు. వాదనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాలను సమర్పించ లేకపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున సుప్రీంకోర్టులో ఇంప్లీడింగ్ పిటిషన్ వేస్తామని తెలిపారు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అనంతరం ఆంధప్రదేశ్ తరపు న్యాయవాది సుదర్శన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మిగులు జలాలపై రాష్టాన్రికి హక్కులేదని, స్వేచ్ఛమాత్రమే ఉందని చెప్పారు. మన డిమాండ్లపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్‌లో ఉందన్నారు. సుప్రీంకోర్టులోని స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తీర్పు తర్వాతే ట్రైబ్యునల్ తీర్పుపై గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. రాష్ట్రం విడిపోతే ఏం చేయాలనేది ట్రైబ్యునల్‌కు సంబంధంలేదని వివరించారు.
న్యాయం జరిగిందా లేదా అన్నది వారే చెప్పాలి: బ్రజేష్
న్యూఢిల్లీ : కృష్ణా జలాల వినియోగంపై తనకున్న పరిధిలో మంచి తీర్పునే ఇచ్చానని అనుకుంటున్నానని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అన్నారు. తీర్పు అనంతరం ఆయన మీడిమాతో మాట్లాడుతూ తానిచ్చిన తీర్పుతో మూడు రాష్ట్రాలు సంతోషంగా ఉంటాయా అన్నది చెప్పలేనని అభిప్రాయపడ్డారు. తన బాధ్యతను మాత్రమే నిర్వర్తించానని ఆయన అన్నారు. అయితే ఈ తీర్పు ఎలా వుదన్నది వారే చెప్పాలన్నారు. ఇదిలావుంటే కృష్ణా జలాల వినియోగంపై ట్రైబ్యునల్ తీర్పు కర్ణాటక ప్రజలకు మేలు చేస్తుందని కర్ణాటక ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఆల్మట్టి ఎత్తును 524.26 విూటర్లకు పెంచేందుకు ట్రైబ్యునల్ అనుమతించిందని ఆయన తెలిపారు. దీనివల్ల తమవాటాను వాడుకునే అవకాశం ఏర్పడిందన్నారు. మరోవైపు కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్రంలోని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పుతో రాష్ట్రం మిగులు జలాలపై హక్కు కోల్పోవడంతో దాని ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని వారు అభిప్రాయపడుతున్నారు. పీఏబీఆర్‌కు 10 టీఎంసీలు కేటాయించాలని కోరినా ట్రైబ్యునల్ పట్టించుకోలేదన్నారు. బలమైన వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. న్యాయవాదులను తరుచూ మార్చడం వల్లే తీర్పు మన రాష్టాన్రికి వ్యతిరేకంగా వచ్చిందన్నారు. సీమాంధ్ర పాలనలో జలపంపకాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జలసాధన సమితి నేత దుశ్చర్ల సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు న్యాయం జరగొద్దని విభజనకు ముందే ట్రైబ్యునల్ తీర్పు వచ్చేటట్లు సీమాంధ్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు.
కృష్ణా నీటికి గండి




