తెలంగాణపై కేంద్రం తుది కసరత్తు

శీతాకాల సమావేశాల్లోనే టీ బిల్లు

రాయల తెలంగాణపై ఆరా తీశారంతే : దామోద రాజనర్సింహ

న్యూఢిల్లీ, నవంబర్‌ 30 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆరు నూరైనా శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని చర్యలను వేగవంతం చేసింది. ఈమేరకు ముసాయిదా రూపకల్పన ఆదివారంలోగా పూర్తి చేయాలని యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ ఆదేశించారు. సోమవారం కేబినెట్‌ ప్రత్యేక భేటీ నేపథ్యంలో కసరత్తు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంగళవారం కేబినెట్‌ ముందు తెలంగాణ ముసాయిదా ఉంచాలని సూచించారు. ముందుగా చెప్పినట్టు హైదరాబాద్‌, పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో రాయల తెలంగాణ ప్రతిపాదన చర్చల స్థాయిలోనే వీగిపోతుందని తెలంగాణ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాయల తెలంగాణ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ సోనియాగాంధీతో శనివారం భేటీ అయి చర్చించారు. రాయల తెలంగాణను తెలంగాణవాదులు వ్యతిరేకించినా అధిష్టానం నిర్ణయాన్ని స్వీకరిస్తారని ఆజాద్‌ సోనియాకు నచ్చజెప్పజూసినట్లుగా సమాచారం. అయితే తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కు దక్కడంతో పాటు రాబోయే ఎన్నికల్లో దాని తాలూకు లబ్ధి చేకూరాలని, అలాంటి లబ్ధికి రాయల తెలంగాణ వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా అని సోనియాగాంధీ ఆరా తీశారు. కాగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్‌తో భేటీ ముగిసిన అనంతరం దామోదర మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు ఏ విధంగా రాబోతుందో సమావేశంలో చర్చించామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, భద్రాచలం, పోలవరం, తదితర అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తీసుకు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం) తన పూర్తిస్థాయి సమావేశాల అనంతరం రాయల తెలంగాణకు ఆస్కారం లేదని సంకేతాలు పంపినా, తాజా పరిణామాలు మాత్రం ఆ దిశగా అధిష్టానం ఆలోచనలు ఇంకా ముగియలేదని స్పష్టం చేస్తున్నాయి. కొన్నాళ్లుగా రాష్ట్ర విభజన అంశంపై నానా రకాలుగా ప్రజలను గందరగోళ పరుస్తున్న జీవోఎం, కాంగ్రెస్‌ ఢిల్లీ నేతలు తాజాగా రాయలసీమను విభజించే ఆలోచనకు పదును పెట్టారు. దామోదర రాజనర్సింహ నేరుగా దిగ్విజయ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాయల తెలంగాణపై తెలంగాణ ప్రాంత నేతల అభిప్రాయాలను మరోమారు ఆయన ముందుంచారు. భేటీ అనంతరం డెప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు, సీడబ్ల్యూసీ తీర్మానానికి రాయల తెలంగాణ పూర్తిగా విరుద్ధం. దీనివల్ల రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరకపోగా నష్టమే ఉంటుందని ఆయన విలేకర్లకు వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, భద్రాచలం, పోలవరం, తదితర అంశాలపై చర్చించామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందన్నారు. తెలంగాణ బిల్లు ఏ విధంగా రాబోతుందో చర్చించామని వివరించారు. అయితే రాయల తెలంగాణ వస్తుందన్న అంశంపై ఆయన స్పసటత ఇవ్వలేకపోయారు. అలాగే ఈ ప్రమాదం లేదని కూడా చెప్పలేకపోయారు.