అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తాం
మంత్రి సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 30 (జనంసాక్షి) :
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌పై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి సుదర్శన్‌రెడ్డి సమావేశమై ట్రైబ్యునల్ తీర్పుపై చర్చించారు. డిసెంబర్ 3న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామన్నారు. ఆ తరవాత సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. బ్రిజేష్‌కుమార్ తీర్పుపై ప్రభుత్వం సరిగా స్పందించలేదనే విమర్శలు వస్తున్ననేపథ్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రి సుదర్శన్ రెడ్డి భావించినా, అఖిలపక్షంలో చర్చించాలని అనుకోవడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కృష్ణా మిగులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిన నేపథ్యంలో అఖిలపక్షంలో చర్చించి తదుపరి చర్యలకు కదలాలని సర్కార్ నిర్ణయించింది.





