హైదరాబాద్, నవంబర్ 30 (జనంసాక్షి) :
మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు దహనంలో ఆప్తులను కోల్పోయిన బాధితులపై పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా బాధ్యులపై చర్య తీసుకోరా అని శనివారం రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను నిలదీసేందుకు బయల్దేరిన బాధిత కుటుంబాలపై తమ ప్రభావం చూపారు. పసి పిల్లలను కూడా దౌర్జన్యంగా అరెస్టు చేశారు. దొంగలను ఈడ్చేసినట్లు ఈడ్చేశారు. సభ్య సమాజం తలవంచుకునే రీతిలో పోలీసులు వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు యజమానులు ఇబ్బడిముబ్బడిగా అనుమతులు లేకుండానే బస్సులను తిప్పుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు ఈ సందర్భంగా ఆరోపిస్తున్నారు. 45 మంది దుర్మరణం పాలైనా కూడా బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలం అయిందని ఆరోపిస్తూ మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. అక్కడే ఉన్న పోలీసులు బాధితుల కుటుంబాల వారిని తోసేశారు. దీనిపై బాధిత కుటుంబాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం ఇంత వరకు బస్సు యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించలేదని వారు ఆరోపించారు. బస్సు ప్రమాదంలో 45 మంది మృతిచెందిన ఘటనను మంత్రి బొత్స చిన్న విషయంగా మాట్లాడటం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులు చనిపోతే ప్రభుత్వం ఇలాగానే వ్యవహరిస్తుందా? అని ప్రశ్నించారు. న్యాయం కోరేందుకు వచ్చిన తమను క్రిమినల్స్‌గా, రాజకీయ నేతలుగా భావించి ప్రభుత్వం అరెస్టు చేయించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అన్నారు. ప్రభుత్వం సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నదని, బాధితులకు కనీసం సానుభూతిని ప్రకటించే స్థితిలో ప్రభుత్వం లేదని వారు విమర్శించారు. బొత్స లాంటి రాజకీయ నేతలకు ఎందుకు ఓట్లు వేశామా? అని సిగ్గుతో తలదించుకుంటున్నామని వారు వాపోయారు. సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని వారు ఆరోపించారు. తమ కుటుంబంలోని సభ్యులు చనిపోయి తాము దిక్కుతోచని స్థితిలో బతుకును వెళ్లదీస్తున్నామని, న్యాయం కావాలని వచ్చిన తమను అరెస్టు చేయడం దారుణమని వారు విమర్శించారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని వారు భీష్మించి కూర్చున్నారు. తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, బస్సు యజమానిని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన బస్సు యజమానిని అరెస్టు చేయకుండా తమను అరెస్టు చేసి సర్కార్ నీచరాజకీయాలకు పాల్పడుతున్నదని బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.





