ముగ్గురు జవాన్లు మృతి
పాట్నా, నవంబర్ 30 (జనంసాక్షి) :
బీహార్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై మావోయిస్టులు శనివారం సాయంత్రం కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు బీహార్ మిలిటరీ పోలీస్ (బీఎంసీ) జవాన్లు హతమవగా, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. సాయంత్రం 7 గంటల సమయంలో సాహెబ్‌గంజ్ నుంచి దానాపూర్ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ మంగేర్ దగ్గర్లోని జమాల్‌పూర్ స్టేషన్ వద్ద ఒక సొరంగాన్ని సమీపిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు బీహార్ మిలటరీ పోలీసు విభాగం అధికారులు తెలిపారు. రైలులో ఎస్కార్టుగా ఉన్న ముగ్గురు భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లని కూడా గాయపరిచి, వారి నుంచి 5 రైఫిళ్లు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లను అపహరించి కదులుతున్న రైలు నుంచి దూకి పరారైనట్లు జమాల్‌పూర్ రైల్వే ఎస్పీ అమితాబ్‌కుమార్ దాస్ తెలిపారు. మృతులను అశోక్‌కుమార్, భోలాఠాకూర్, ఉదయ్‌సింగ్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. అయితే మావోయిస్టులు సాధారణ ప్రయాణికులెవరిని గాయపరచలేదన్నారు. సంఘటనాస్థలం బీహార్ రాజధాని పాట్నా నుంచిదాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. మావోయిస్టుల దాడికి సంబంధించి సమాచారం అందిన వెంటనే సమీపంలోని ముంగేర్, భాగల్పూర్ నుంచి ఉన్నతాధికారులు అదనపు భద్రతాసిబ్బందిని సంఘటనాస్థలానికి పంపారు.





