జీవోఎం కసరత్తు పూర్తయింది : షిండే
ముంబయి, డిసెంబర్ 1 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. తెలంగాణ బిల్లు తొందర్లోనే పార్లమెంట్ ముందుకు వస్తుందని ఆయన అన్నారు. షిండే ఆదివారం ముంబయిలో విలేకరులతో మాట్లాడారు. విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం కసరత్తు దాదాపు పూర్తి చేసిందని పేర్కొన్నారు. కేబినెట్ బృందం రూపొందించిన ముసాయిదాను న్యాయశాఖ పరిశీలించిన తర్వాత పార్లమెంట్ ఆమోదానికి వస్తుందని తెలిపారు. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతే రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుందన్నారు. రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం కోసం శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అవుతుంది. అదే రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి మండలి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో తెలంగాణపై జీవోఎం సిద్ధం చేసిన ముసాయిదాపై చర్చిస్తారు. సోమవారం బిల్లులో న్యాయపరమైన చిక్కులేమైనా ఉన్నాయా అని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ మరోసారి పరిశీలిస్తారు. బిల్లుకు తుదిరూపు ఇచ్చిన జైరాం రమేశ్ ఆదివారం కూడా వివిధ శాఖల అధికారుల నుంచి సమాచార సేకరణ జరిపారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన మొత్తం ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతామని షిండే చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రంతో పాటు రాయల తెలంగాణ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, దీనిపై సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయని అన్నారు. సోమవారం కూడా మరికొందరితో సంప్రదింపులు జరుపనున్నామని, ఇవన్నీ సాయంత్రానికళ్లా పూర్తి చేస్తామని తెలిపారు. మరో వైపు
సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో లబ్ధి చేకూరాలని, ముసాయిదా ఆ దిశగానే ఉండాలని జీవోఎం సభ్యులను ఆదేశించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఆగ్రహం తెప్పించే చర్యలకు పూనుకోవద్దని ఆదేశించినట్లు తెలిసింది. అదే సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పరిధిపై కూడా వివాదాలు తలెత్తేలా వ్యవహరించవద్దని అన్నట్లు సమాచారం.





