Tuesday, 3 November 2026

ఆరు రోజుల పోలీసు కస్టడీకి తరుణ్‌ తేజ్‌పాల్‌

పణాజి, డిసెంబర్‌ 1 (జనంసాక్షి) :

తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌కు పనాజీ జిల్లా సెషన్స్‌ కోర్టు ఆరు రోజుల పోలీసుల కస్టడీ విధించింది. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై శనివారం రాత్రి పనాజీ పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం తేజ్‌పాల్‌ సమర్పించిన పిటీషన్‌ను పనాజీ జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి అనూజా ప్రభుదేశాయ్‌ తిరస్కరించారు. తేజ్‌పాల్‌ బాధితురాలికి తండ్రిలాంటి వారని అలాంటి వ్యక్తి ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారని న్యాయమూర్తి తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం, వారిద్దరి మధ్య జరిగిన ఈమెయిళ్లు సాక్ష్యంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఇలాంటి నేరాల్లో బాధితులు మానసికంగా, శారీరకంగా కుంగిపోతారని న్యాయమూర్తి తెలిపారు. బాధితురాలి సమ్మతితోనే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని తరుణ్‌తేజ్‌పాల్‌ మాట మార్చుతున్నారని తెలిపారు. అయితే తమ ఆధీనంలో ఉన్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడం… వారి హక్కులను ఉల్లంగించడమేనని తెలిపారు. ఆరోపణలపై రాజకీయ కుట్ర ఉందని వాదించిన తేజ్‌పాల్‌ తరపు న్యాయవాది గీతాలూత్రా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని తెలిపారు. బాధిత మహిళా విలేకరి కుటుంబాన్ని తేజ్‌పాల్‌ ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సరేశ్‌ లోత్లికర్‌ తన వాదనలను వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *