Monday, 2 November 2026

టీ ముసాయిదా సిద్ధం

69 పేజీల నివేదిక
రెండు రాష్ట్రాల్లో 371 (డి)
హైదరాబాద్‌పై నేడు కీలక నిర్ణయం
ఆమోదం తెలిపిన షిండే
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా సిద్ధమైంది. మంగళవారం నిర్వహించే మంత్రుల బృందం సమావేశంలో ఈ ముసాయిదాను పరిశీలించనున్నారు. ఈ సమావేశంలోనే హైదరాబాద్‌పై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని పరిధిపై ఉన్న డిమాండ్లను పరిశీలించి కీలక నిర్ణయం తీసుకోకున్నారు. మంత్రుల బృందం 69 పేజీలతో కూడిన నివేదిక రూపొందించగా దానికి కేంద్ర హోం మంత్రి, మంత్రుల బృందం సారధి సుశీల్‌కుమార్‌షిండే ఆమోదం తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ లోకల్‌ కేడర్‌ను కొనసాగించేందుకు ఆర్టికల్‌ 371(డి)ని కొనసాగించనున్నారు. సోమవారం ఢిల్లీలో తెలంగాణపై సంప్రదింపులు జోరుగా సాగాయి. ఏకే ఆంటోనీతో పీసీసీ మాజీ చీఫ్‌ డీఎస్‌ సమావేశమయ్యారు. అంతకు ముందు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో డీఎస్‌ భేటీ అయ్యారు. జీవోఎం నివేదిక, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం. హస్తినకు తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులు చేరుకున్నారు. వివిధ పార్టీల నేతలను టీ జేఏసీ నేతలు కలువనున్నారు. డీిఎస్‌ దిగ్విజయ్‌ను కూడా కలుసుకుని చర్చించారు. మరోవైపు రాయల తెలంగాణ వాదం గట్టిగా వినపిస్తోంది. ఈ దశలో వీహెచ్‌ తెలంగాణ చైతన్యయాత్ర కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలోని యాదగిరి నరసింహస్వామి పుణ్యక్షేత్రం నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ వి.హన్మంతరావు తెలంగాణ చైతన్యయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్‌, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. మరోవైపు రాయల తెలంగాణకు ఒప్పుకోం అని ఎమ్మెల్సీ దిలీప్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఎక్కువ భూకబ్జాలకు పాల్పడింది సీమ వేరేనని ఆయన ఆరోపించారు. ఇది కొందరిని ప్రలోభ పర్చడానికేనని ఆయన వరంగల్‌లో మండిపడ్డారు. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇక రాయల తెలంగాణ అంశంపై అధిష్టానం పిలుపు మేరకు రెండు రోజుల క్రితం హస్తిన వెళ్లిన దామోదర ఆ మేరకు కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం దామోదర మరోసారి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కాగా ఆయన పర్యటన వాయిదా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని దామోదర స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ కల సాకారం కాబోతుందని ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ నేతలకు, రాయల తెలంగాణ ప్రతిపాదన కలవరం కలిగిస్తోంది. రాయల తెలంగాణ కేవలం విూడియా ప్రచారం మాత్రమేనని ఒకవైపు ఖండిస్తూనే, మరోవైపు కలవరపడుతున్నారు.
జీవోఎం నివేదికలో అంశాలు తెలియవు : దిగ్విజయ్‌
రాష్ట్ర విభజనపై ఏర్పడ్డ కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నివేదికలో ఏముందో తనకు తెలియదని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. జీవోఎం నివేదిక త్వరలోనే కేంద్ర కేబినెట్‌ ముందుకు వస్తుందని, కేబినెట్‌ ఆమోదించాక అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. అయితే జివోంలో తాను సభ్యుడిని కాదని, అందువల్ల తాను వాటి వివరాలను వెల్లడించలేనన్నారు. విభజన పక్రియ త్వరలోనే ముగుస్తుందని దిగ్విజయ్‌ వెల్లడించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్లు దిగ్విజయ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాయల తెలంగాణ అంశంపై వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. వ్యక్తిగత సంభాషణల వివరాలు మీడియాకు చెప్పలేనని, రాయల తెలంగాణ అంశాన్ని తాను ఖండించ దలుచుకోలేదని దిగ్విజయ్‌ అన్నారు. మొత్తంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సమయంలోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. రాయల తెలంగాణకు సంబంధించి ఎటువంటి వివరాలు కూడా తనకు తెలియవని వ్యాఖ్యానించారు. ఉపముఖ్యమంత్రి రాజనర్సింహతో చర్చించిన విషయాలను తాను బహిర్గతం చేయనని చెప్పారు. దిగ్విజయ్‌ వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాయల తెలంగాణ ప్రతిపాదన పైన సీరియస్‌గా ఆలోచిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.అధిష్టానం రాయల తెలంగాణపై ఆలోచిస్తోందా అని విలేకరులు ప్రశ్నిస్తే.. ఇప్పుడు ఏ అంశాన్ని కొట్టి పారేయలేమని దిగ్విజయ్‌ చెప్పడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. తద్వారా అధిష్టానం రాయల తెలంగాణ పైన సీరియస్‌గా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాయల తెలంగాణపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, జివోఎం భేటీ అనంతరం స్పష్టత వస్తుందన్నారు. గతంలో దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడిన పలు సందర్భాల్లో సిడబ్ల్యూసి నిర్ణయం మేరకే విభజన ఉంటుందని, ముఖ్యమంత్రి సహా అందరు దానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం రాయల తెలంగాణను కొట్టి పారేయలేమని చెబుతున్నారు. అదే సమయంలో శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశముందన్నారు. జివోఎం పక్రియ మాత్రం త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో చర్చించిన అంశాలపై తాను బయటకు చెప్పలేనని, అవి ప్రయివేటు విషయాలన్నారు. కాగా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో రెండు రోజుల క్రితం ఢిల్లీ పెద్దలు రాయల తెలంగాణ అంశంపై చర్చించిన విషయం తెలిసిందే. రాయల తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలను ఒప్పించే ప్రయత్నాలు అధిష్టానం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని జివోం సభ్యుడు, ¬ంమంత్రి షిండే కూడా తెలిపారు. త్వరలోనే తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వస్తుందని చెప్పారు. రాయల తెలంగాణకు సంబంధించి ఎటువంటి అంశాలను ఆయన వెల్లడించలేదు. దీన్నిబట్టి రాయల తెలంగాణ వైపు కేంద్రం ఖచ్చితమైన అడుగులు వేస్తోందని అర్థం అవుతోంది. ఇదిలావుంటే 370 ఆర్టికల్‌పై మోడీ చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్‌ తీవ్రంగా స్పందించారు. దీనిపై చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడా అసవరం కూడా లేదన్నారు. కాశ్మీర్‌కు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో ఈ వెసులబాటు కల్పించడం జరిగిందని అన్నారు. అందువల్ల ఇప్పుడు దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే అలాంటిదేమైనా ఉంటే మోడీ దానిని బిజెపిలో చర్చించుకోవాలని హితవు పలికారు.
సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే తెలంగాణ: డిఎస్‌
సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన వివిధ నేతలను కలిసి బిజీగా ఉన్నారు. దిగ్విజయ్‌తో పాటు పలువురు నేతలను కలుసుకున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను సీమాంధ్ర నేతలు జీవోఎంపై గట్టి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ శాంతిభద్రతలు గవర్నర్‌ వద్ద ఉండే అవకాశం ఉందని డీఎస్‌ అన్నారు. తాత్కాలిక సర్ధుబాటే కాబట్టి ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. భద్రాచలం సమస్య సాంకేతికమైందని అన్నారు. హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదన అసలు లేదని డీఎస్‌ పేర్కొన్నారు. కాగా ఉదయం ఆయన కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డితో భేటీ అయ్యారు. జీవోఎం నివేదిక, రాయల తెలంగాణ తదితర అంశాలపై వారిరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *