Tuesday, 3 November 2026

బ్రిజేశ్‌ కుమార్‌ తీర్పు గెజిట్‌ వేయొద్దు

రాష్ట్రపతిని కోరిన బాబు
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) :
బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పును గెజిట్‌ చేయవద్దని రాష్ట్రపతిని కోరినట్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ తీర్పుతో కృష్ణా పరివాహకంలో 14 జిల్లాలు ఎడారి కాబోతున్నాయని అన్నారు. అలాగే హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తప్పేలా లేవన్నారు. సోమవారం చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి నేతల బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసింది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై చంద్రబాబు రాష్ట్రపతికి 8 పేజీల నివేదిక సమర్పించారు. ట్రైబ్యునల్‌ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై బృందం రాష్ట్రపతికి వివరించింది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పును గెజిట్‌లో ప్రకటించకుండా చూడాలని రాష్ట్రపతిని కోరినట్లు ఆయన తెలిపారు. మిగులు జలాలు అవసరం లేదని వైఎస్‌ ఇచ్చిన అఫిడవిట్‌తో రాష్ట్రం నష్టపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ ట్రైబ్యునల్‌ తీర్పులో రాష్టాన్రికి జరిగిన అన్యాయంపై రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎనిమిది పేజీల నివేదిక సమర్పించనట్లు పేర్కొన్నారు. ట్రైబ్యునల్‌ తీర్పు ఏకపక్షంగా ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఇంతవరకు ఏ ప్రాజెక్టు కట్టినా 75 శాతం నీటి లభ్యతనే ప్రామాణికంగా తీసుకున్నారని గుర్తు చేశారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ మాత్రం 65 శాతం నీటి లభ్యతనే ప్రామాణికంగా తీసుకుని కేటాయింపులు చేశారని తెలిపారు. నీటి లభ్యత డేటా ఉన్నంత మేరకు పరిగణలోకి తీసుకోవాలన్నారు. నీరు ఆలస్యంగా వస్తే సీజన్‌ మారుతుందని, పంట తుఫాను బారినపడుతుందని చెప్పారు. జల విద్యుదుత్పత్తి కూడా ఆగిపోతుందని పేర్కొన్నారు. ట్రైబ్యునల్‌ తీర్పు తప్పుల తడకగా మారిందని, రాష్ట్ర హక్కులు కాలరాశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు ట్రైబ్యునల్‌ ముందు సరిగా వినిపించలేదని ఆరోపించారు. అలాగే రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాల ఐకాస నేతలతో మాట్లాడి సమన్యాయం చేయాలని చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కోరారు. చంద్రబాబుతో పాటు దేవేందర్‌ గౌడ్‌, సిఎం రమేశ్‌, నామా నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *