ప్రధాని మన్మోహన్‌సింగ్
ఈ సమావేశాల్లోనే బిల్లు : కమల్‌నాథ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 3 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. స్వల్ప వ్యవధి ఉండటంతో శీతాకాల సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ విపక్షాలకు ప్రధాని పిలుపునిచ్చారు. అవసరమైతే సమావేశాలను పొడిగించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ సందర్భంగా స్సష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ముందుకు వెళ్తోందని ప్రధాని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి జీఓఎం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేబినెట్ ముందుకు జీవోఎం నివేదిక రానుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలను సజావుగా నడిపేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాయల తెలంగాణకు సోనియా మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో కేబినెట్ సమావేశం గురువారం జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశ ప్రస్తావన రాకపోవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై ఇప్పటివరకు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ అంటూ సాగిన కసరత్తు అకస్మాత్తుగా రాయల తెలంగాణ దిశగా సాగుతున్నట్లుగా లీకులిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో రాజకీయ చిచ్చు రేపుతోంది. అయితే దీనిపై జీవోఎం సభ్యులు మాత్రం తమకేమీ తెలియదని చెబుతుండటం గమనార్హం. తాజాగా కేంద్ర ¬ంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాయల తెలంగాణ ప్రతిపాదన గురించి తనకు ఏవిూ తెలియదన్నారు. ఈ నెల 5వ తేదీన కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుందని జీవోఎం నివేదికను ఆరోజే ఆమోదిస్తామన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లుతో పాటు జీవోఎం నివేదిక అంశం చర్చకు వస్తాయని ఆయన తెలిపారు.మరోవైపు షిండేతో ఈరోజు ఉదయం జైరాం రమేష్ భేటీ అయ్యారు. గంటసేపు జరిగిన మంతనాల్లో జీవోఎం తుది నివేదికపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక కేంద్ర మంత్రి చిరంజీవి కూడా షిండేతో సుమారు 15 నిమిషాలు పాటు సమావేశం అయ్యారు. కాగా రాష్ట్ర విభజనపై జీవోఎం నివేదికలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ, లేక రాయల తెలంగాణ అనేది స్ఫష్టత లేకపోవటంతో పాటు ఢిల్లీ నుంచి రోజుకో ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో గందరగోళం నెలకొంది.
శీతాకాలపు సమావేశాల్లోనే..: కమల్‌నాధ్
పార్లమెంటు శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని.. డిసెంబరు 20 వరకు తొలివిడత సమావేశాలు జరగనున్నట్టు కేంద్ర మంత్రి కమల్‌నాధ్ తెలిపారు. మరో వారం రోజుల పాటు సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షాలు కోరాయి. అందుకు అంగీకరించామని తెలిపారు. రాజ్యసభ సభ్యులను, దక్షిణాది రాష్ట్రాల ఎంపీలను సంప్రదించిన తర్వాతే సమావేశాల పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. శీతాకాల సమావేశాల్లో టి.బిల్లును ప్రవేశపెట్టడానికి అన్ని పార్టీలు అంగీకరించాయని వెల్లడించారు. సాధ్యమైనంత తొందర్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఇదిలాఉండగా శీతాకాల సమావేశాల్లోనే టి.బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ అఖిలపక్ష సమావేశంలో కోరినట్టు తెలిసింది.





