Tuesday, 3 November 2026

పది జిల్లాల తెలంగాణ తెచ్చే బాధ్యత కాంగ్రెస్‌ నేతలదే

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) :

పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఆమోదింపచేసే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్‌ నేతలదేనని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద మౌనదీక్ష అనంతరం కోదండరామ్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విభజన ఆపేందుకే చివరి ప్రయత్నంగా రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకొచ్చారని కోదండరాం ఆరోపించారు. ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్తితుల్లోనూ అంగీకరించమని అన్నారు. రాయల తెలంగాణకు ఇరుప్రాంతాల నేతలు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రజలు తమ తెలంగాణ కావాలని కోరారని అన్నారు. అంతేగాని అదనంగా మరో రెండు రాయలసీమ జిల్లాలను కోరలేదన్నారు. తమకు అక్కర్లేని ప్రాంతాలను కలిపితే ఊరుకోమని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం జరిగిందే తప్ప సీమతో కూడిన తెలంగాణ కోసం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ అంశం తెరపైకి వచ్చిందని కోదండరామ్‌ ఆరోపించారు. నాలుగు జిల్లాలతో ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని విభజించవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమను విభజించడం వల్ల సీమవాసులకు మేలు జరగదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనేది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే విభజించాలని ఆయన పేర్కొన్నారు. జులై 30వ తేదీన తెలంగాణపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్నే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. న్యూఢిల్లీలోని జాతీయ పార్టీ నేతలను కలసి రాయల తెలంగాణను వ్యతిరేకించాలని కోరతామని చెప్పారు.10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని కోదండరామ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కేంద్రానికి హితవు పలికారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ తీసుకురావలసిన బాధ్యత టి.కాంగ్రెస్‌ నేతలదే ఆయన వ్యాఖ్యానించారు. అలాకాకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా టి.కాంగ్రెస్‌ నేతలను హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌, విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస కన్వీనర్‌ రఘు తదితరులు మౌన దీక్షలో పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో తెలంగాణ ఐకాస నేతలు భేటీ అయ్యారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇచ్చేలా చూడాలని ఐకాస నేతలు సుధాకర్‌రెడ్డిని కోరారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *