Tuesday, 3 November 2026

ఢిల్లీలో పోలింగ్‌కు సర్వం సిద్ధం

‘ఢిల్లీ’లో పోలింగ్‌కు సర్వం సిద్ధం8న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి

స్వల్ప సంఖ్యలో మహిళా అభ్యర్థులు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) :

ఢిల్లీ శాసనసభ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌బూత్‌ల వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరింపజేశారు. సున్నితమైన పోలింగ్‌ బూత్‌ల వద్ద ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 11,753 పోలింగ్‌ బూత్‌లను సమస్యాత్మక మైనవిగా గుర్తించారు. మొత్తం 1.19 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. వారిలో 66లక్షల మంది పురుష ఓటర్లు కాగా.. 53లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంతేగాక ఈ దఫా ఎన్నికల్లో కొత్తగా చేరిన సుమారు నాలుగు లక్షల మంది ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటైన ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా ఎన్నికల్లో మొత్తం 796మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. కాంగ్రెస్‌, బిజెపి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మహిళలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 2008 ఎన్నికల్లో మొత్తం 57మంది మహిళా అభ్యర్ధినులు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో మాత్రం వారి సంఖ్య అతిస్వల్పంగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీ నుండి ఆరుగురు మహిళా అభ్యర్థులు, బిజెపి నుండి ఐదుగురు.. ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున ఆరుగురు మహిళా అభ్యర్ధినులు బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా 2008లో జరిగిన ఎన్నికల్లో పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.. కాంగ్రెస్‌ 43, బిజెపి 23, బిఎస్‌పి 2, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ అయినా 36 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది.

అభ్యర్థులు ఎందరున్నా..

ఎన్నికల బరిలో అభ్యర్ధులు ఎందరున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌, బిజెపి, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్యేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నాల్గోసారి సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు షీలాదీక్షిత్‌ తీవ్రంగా శ్రమించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ఆద్యంతం తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగించారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ప్రచారపర్వంలో పాల్గొన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలను ఎక్కుబెట్టారు. అలాగే బిజెపి సీఎం అభ్యర్ధి హర్షవర్ధన్‌ సైతం ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి సైతం ప్రచారాన్ని నిర్వహించారు. యువతను ఆకట్టుకున్నారు. కొత్తగా ఏర్పాటైన అమ్‌అద్మీ పార్టీ అయితే వినూత్న రీతిలో ప్రచారాన్ని సాగించింది. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించింది. యువ ఓటర్లను ఆకర్షించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఏదేమైనా ఓటరన్న తీర్పును తెలుసుకోవాలంటే డిసెంబర్‌ 8వ తేదీ వరకు వేచి చూడాల్సిందే!

నేటితో పూర్తి..

ఢిల్లీ రాష్ట్రంలో బుధవారం జరగనున్న పోలింగ్‌తో.. మొత్తం అయిదు రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయినట్టే. ఫలితాలు ఈనెల 8, 9 తేదీల్లో వెల్లడికానున్నాయి. ఇదిలా ఉండగా 2008 ఎన్నికల్లో చత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో బిజెపి విజయభేరి మోగించడం.. రాజస్థాన్‌, మిజోరం, ఢిల్లీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *