Tuesday, 3 November 2026

రాష్ట్రపతి భవన్‌కు తెలంగాణ బిల్లు

నేడో రేపో అసెంబ్లీకి పంపే అవకాశం
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై మంత్రుల బృందం సమర్పించిన ముసాయిదాకు గురువారం ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం బిల్లును రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ పరిశీలన కోసం పంపింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ రాష్ట్ర పునర్విభజనపై తన అభిప్రాయాన్ని తెలిపేందుకు రాష్ట్రపతి ఎంత సమయం ఇస్తారనే దానిపై ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీమాంధ్రులు ఆశిస్తున్నట్లుగా విభజనకు రాష్ట్రపతి ఎక్కువ సమయం కేటాయిస్తారా? పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్న సోనియాగాంధీకి సానుకూలంగా తక్కువ వ్యవధిలో అభిప్రాయం చెప్పాలని కోరుతారా అనే దానిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ పర్యటనలో ఉన్నారని, ఆయన శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఆదివారం తెలంగాణ బిల్లును పరిశీలించి ఆ మరుసటి రోజు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ అభిప్రాయం కోసం పంపుతారని తెలిసింది. అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ బిల్లు-2013పై తమ అభిప్రాయాన్ని చెప్పాక తిరిగి కేంద్ర కేబినెట్‌కు చేరుతుంది. కేంద్ర మంత్రివర్గం భేటీ దీనిపై మరోమారు చర్చించిన తర్వాత పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. బిల్లుపై శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ఎంత సమయమిస్తారో తనకు తెలియదని, అయితే ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ముందుకు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి భవన్‌కు తెలంగాణ బిల్లు చేరడంపై తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *