Tuesday, 3 November 2026

శీతాకాల సమావేశాల్లోనే టీ బిల్లు

వీలుకాకపోతే జనవరిలో ప్రత్యేక సమావేశాలు : దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) :
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి చేరాక అసెంబ్లీకి ఎంత సమయం ఇస్తారన్న విషయం రాష్ట్రపతి నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీనుంచి పార్లమెంటుకు వచ్చేందుకు కొంత సమయం పట్టవచ్చని, ఈ సమావేశాల్లో బిల్లు పెట్టడం సాధ్యం కాకపోతే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. అవసరమైతే జనవరిలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. విభజన బిల్లులో సాధ్యమైనంత వరకు అన్నింటినీ పొందుపరిచే ప్రయత్నం చేశామని, మరిన్ని అంశాలను ప్రస్తావించే హక్కు సీమాంధ్ర నేతలకు ఉందని దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. చేర్చాల్సిన అంశాలు ఉంటే సీమాంధ్ర నేతలు బిల్లుపై చర్చలో ప్రస్తావించవచ్చన్నారు. సీమాంధ్ర నేతలు ప్రస్తావించే అంశాలను బిల్లులో చేర్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. బిల్లుపై చర్చ జరిగేటప్పుడు సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామన్న దిగ్విజయ్‌, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవించాలని కాంగ్రెస్‌ నేతలందరికీ విజ్ఞప్తి చేశారు. తప్పుండా బిల్లులో సీమాంధ్రకు తగిన విధంగా న్యాయం చేస్తామని అన్నారు. వారి ఆందోళనను గౌరవిస్తామని అన్నారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్ర నేతలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్‌ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లుపై శాసనసభలో వ్యవహరించే విషయంలో తమ వ్యూహం తమకు ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీలో కూడా బిల్లును ఆమోదింపజేసుకునే వ్యూహం తమకు ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అంగీకరించారని చెబుతూ ఇప్పుడు అభ్యంతరమెందుకని ఆయన అడిగారు. సీమాంధ్ర ప్రజల విశ్వాసాన్ని పొందడానికి అవసరమైన అంశాలు బిల్లులో ఉన్నాయని ఆయన చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు చేస్తున్న విమర్శలను స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. అవసరమైతే బిల్లులో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. బిల్లులో సాధ్యమైనంతవరకు అన్ని విషయాలను పొందుపరిచామని, బిల్లుపై చర్చ సందర్భంగా సీమాంధ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. బిల్లులో చేరాల్సిన అంశాలు ఉంటే చర్చ సందర్భంగా సీమాంధ్ర నాయకులు చెప్పవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెసు నాయకులంతా కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో విజయానికి వ్యూహాలు రచిస్తామని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *