ముసాయిదాపై అభ్యంతరాలున్నాయి : కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 6 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై పార్టీ నేతలతో శుక్రవారం చర్చించిన అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూనే తమకు ముసాయిదా బిల్లుపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. వీటిని స్టడీ చేస్తున్నామని, అభ్యంతరాలను ప్రధాని మన్మోహన్ దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. కేంద్రంతో మిగతా 28 రాష్ట్రాలకు ఉన్న సంబంధాలే కొత్తగా ఏర్పడబోయే తెలంగాణకు కూడా ఉండాలన్నారు. అప్పులు, ఆస్తుల పరంగా తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో కొన్ని అభ్యంతరాలున్నాయి. తెలంగాణ ఇస్తూ మళ్లీ ఆంక్షలు పెట్టారు. ఇది మాకు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. గవర్నర్ సూపర్ కౌన్సెల్, అప్పులు, ఆస్తులు పంపకాలపై తమకు అభ్యంతరం ఉందని తెలిపారు. వీటిపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాస్తామని స్పష్టం చేశారు. అలాగే వీటిపై అభ్యంతరాలను తొలగించేలా పార్లమెంటులో పోరాడుతామన్నారు. ఇందుకు వివిధ సభ్యుల సహకారం కూడా తీసుకుంటామన్నారు. ఉద్యోగుల పెన్షన్లు, గవర్నర్ పెత్తనం, ప్రాజెక్టుల ఖర్చు, ఏపీి భవన్, నదీజలాల పంపిణీ, రాజ్యసభ సీట్ల కేటాయింపు తదితర అంశాలపై ఆయన సుదర్ఘంగా వివరణ ఇచ్చారు. పెన్షన్లను భరించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలో ఇచ్చిన జీవో, ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన 610 జీవోలకు భిన్నంగా 83వేల ఉద్యోగుల నియామకం జరిగిందన్నారు. వీరందరికి పెన్షన్లు ఎందుకు ఇవ్వాలన్నారు. ఓ రకంగా ఉద్యోగాలు కోల్పోయి, ఇప్పుడు పెన్షన్లు భరించాలంటే ఎలా అని అన్నారు. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాకే సంబరాలు చేసుకుంటామన్నారు. నిజానికి తెలంగాణ వస్తే మొదట సంతోష పడేది తానేనని, అందుకే అప్పుడే సంబరం వద్దన్నానని కేసీఆర్ చెప్పారు. ముసాయిదా బిల్లు ఫైనల్ బిల్లుగా ఉభయసభల్లో ఆమోదం పొందాక ప్రపంచంలో ఎవరు జరపనంత సంబరం చేస్తామన్నారు. బిల్లును విశ్రాంత ఐఏఎస్, నీటిపారుదల అధికారులతో అధ్యయనం చేయిస్తున్నామన్నారు. అధ్యయనం చేశాక బిల్లులో ఏమేం మార్పులు చేయాలో గుర్తించి ప్రధానికి లేఖ రాస్తామని, అవసరమైతే స్వయంగా కలిసి అభ్యంతరం తెలియజేస్తామని చెప్పారు. 28 రాష్ట్రాలపై లేని ఆంక్షలు 29వ రాష్ట్రంపై ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణకు అధికారం ఇచ్చినట్లే ఇచ్చి గవర్నర్ పెత్తనం పెట్టారని, తెలంగాణపై గవర్నర్ అధికారాలు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన పింఛన్ల కేటాయింపు ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఒకేరోజు చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌పై కేంద్రం విధించిన ఆంక్షల గురించి ప్రజలకు తెలియజేయండని కోరారు. వదంతులు, ప్రచారాలను నమ్మి సీమాంధ్ర ప్రజలు అధైర్యపడ్డవద్దని, వారిని తెలంగాణ రాష్ట్రంలో గుండెల్లో పెట్టుకుని సాదుకుంటామని కేసీఆర్ హావిూ ఇచ్చారు. సీమాంధ్ర నుంచి వచ్చిన ప్రజలు ఎలాంటి అభద్రతా భావానికి లోనుకావద్దని, అపోహాలను నమ్మొద్దని ఆయన కోరారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ఇక్కడున్న సీమాంధ్ర ప్రజలకు వందకు వంద శాతం రక్షణ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీకి తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్ర నాయకులు ఇప్పటికైనా కేంద్రం నుంచి వారి ప్రాంతానికి కావాల్సినవి అడిగి అక్కడి ప్రజలకు న్యాయం చేయాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహస్‌సింగ్‌కు, సహకరించిన బిజెపి, ఇతర పక్షాలకు టీఆర్‌ఎస్ అధినేత తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసినందుకు ఇద్దరికి ధన్యావాదాలు తెలుపుతున్నానన్నారు. అదే విధంగా ముసాయిదా బిల్లుకు సహకరించిన బీజేపీ ఇతర పక్షాలకు కూడా తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ తానొక్కడి వల్ల సాధ్యం కాలేదని, ప్రజల సహకారం తోడైందని తెలిపారు. తెలంగాణ అమరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని స్పష్టం చేశారు. 2001లో మొదలైన ఉద్యమం నిన్నటి దాకా తెలంగాణ అంతా ఒక్కటై ఉద్యమించిందని తెలిపారు. ‘నేను పక్కదారి పడితే రాళ్లతో కొట్టి చంపండని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడే సంబరాలు వద్దని, ఉద్యమ నాయకత్వం విశ్రాంతి తీసుకోవద్దని, నిన్నటిది ముసాయిదా బిల్లు మాత్రమేనని ఇంకో ఘట్టం మిగిలి ఉందన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పాసైన రోజు ప్రపంచంలో ఎవరూ జరుపుకోనంత సంబురాలు జరుపుకుందాం’ అని తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్, నీటిపారుదల రంగ నిపుణులతో బిల్లును అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రకటించినందుకు ప్రధాని, సోనియాకు కృతజ్ఞతలు




