ప్రపంచ దేశాల ఘననివాళి
జోహెన్నస్‌బర్గ్, డిసెంబర్ 6 (జనంసాక్షి) :
నల్లజాతి సూరీడు అస్తమించాడు. జాతి వివక్షపై ఎదురొడ్డి పోరాడిన ధీరోదాత్తుడు.. జైలు నుంచే స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన అభినవ గాంధీ మండేలా ఇకలేరు. దక్షిణాఫ్రికా నల్ల సూరీడు నెల్సన్ మండేలా (95) గురువారం అర్ధరాత్రి జోహెన్నెస్‌బర్గ్‌లోని ఆయన నివాసంలో మరణించారు. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుమూసినట్లు దేశ అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు. ఆయన మృతితో దక్షిణాఫ్రికా విషాదంలో మునిగి పోయిందిన ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. జులై18, 1918లో దక్షిణాఫ్రికాలోని కేప్ప్రావిన్స్లోని మెవిజోలో జన్మించిన మండేలా నల్లజాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మహాత్ముడిని ఆదర్శంగా తసీఉకుని దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై ఆయన చేసిన పోరాటం ప్రపంచాన్ని కదిలించిది. అప్పటి ప్రిటోరియా ప్రభుత్వం మండేలాను దాదాపు 28 ఏళ్లపాటు జైలులో బంధించింది. ఆ తరవాత ఆయన తన దేశానికి ఐదేళల్పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. డచ్, ఈస్ట్ ఇండియా పాలనను ధీటుగా ఎదుర్కొన్న ఆయన నల్లజాతీయుల హక్కుల కోసం 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపారు. ఆఫ్రికా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. 1994 నుంచి 1999 వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కృషికి 1993లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఆయన జీవిత కాలంలో సుమారు 250 పురస్కారాలు అందుకున్నారు. 1991నుంచి 1997 వరకు ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. ఎయిడ్స్ నిర్మూలన కోసం ఐక్యరాజ్య సమితితో కలిసి అవిశ్రాంత పోరాటం చేశారు. మండేలాకు ఆరుగురు సంతానం ఉన్నారు. మండేలా మృతితో దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచ దేశాలు శోక సంద్రంలో మునిగాయి. మండేలా జీవిత చరిత్రపై రూపొందించిన చలన చిత్రం త్వరలో విడుదల కానుంది. వివిధ దేశాధినేతలు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన మృతితో ఓ మహాత్ముడిని కోల్పోయామని తమ సందేశంలో పేర్కొన్నారు. శ్వేత జాతి అహంకారంపై పోరాడిన నల్ల జాతీయుడు నెల్సన్ మండేలా మృతిపై ప్రపంచ దేశాలు సంతాపం ప్రకటించాయి. మండేలా మృతిని ఆఫ్రికా ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న అక్కడి ప్రజలు రోడ్లపైకి చేరుకుని మండేలా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. మనందరికీ అత్యంత ప్రేమ పాత్రుడు, మొట్ట మొదటి ఆఫ్రికా దేశాధ్యక్షుడు, బానిస వ్యవస్థ వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా మనల్ని వదిలి వెళ్లిపోయారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఆయన ప్రశాంతంగా తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్నారు. మన జాతి గొప్ప కుమారుడిని కోల్పోయింది. మన దేశ ప్రజలు తమ తండ్రిని కోల్పోయారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జుమా అన్నారు. మహాత్ముడి అడుగుజాడల్లో నడిచిన మండేలాను భారత్ ప్రభుత్వం 1990లో భారత రత్న బిరుదతో సత్కరించింది. ఆయనకు 1996లో శాంతి పురస్కారం, 1999లో గాంధీ-కింగ్ అవార్డు, 2001లో గాంధీ అంతర్జాతీయ పురస్కారం, 2002లో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అవార్డును మండేలా అందుకున్నారు. నల్ల సూరీడు మృతికి ప్రపంచ దేశాల సంతాపం ప్రకటించాయి. భారత పార్లమెంటు ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. నెల్సన్ మండేలా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ ప్రకటించారు. మండేలా న్యాయానికి ఒక ప్రతీక, ఆపాదమస్తకం ఆయన మానవ స్ఫూర్తిని చిహ్నంగా నిలిచారని తన సంతాపసందేశంలో పేర్కొన్నారు. సాటి మనుషులకు గౌరవం కల్పించడం కోసం, సమానత్వం, స్వేచ్ఛను కల్పించడం కోసం నిస్వార్థంగా పోరాడిన ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మన జీవితాలను వ్యక్తిగతంగా కూడా చాలా లోతుగా స్పృశించారని నివాళులు అర్పించారు. నెల్సన్ మండేలా ఈ భూమిపై జీవించారన్న నిజానికి మనం కృతజ్ఞులమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సందేశంలో పేర్కొన్నారు. ఒక వ్యక్తి చరిత్రను తన చేతుల్లోకి తీసుకున్నారు. న్యాయం వైపు విశ్వవ్యాప్తమైన విలువలను తీసుకెళ్లారు. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉండాలని దేవుడు ఆశ్వీరదిస్తాడు. దేవుడు ఆయనకు ప్రశాంతత అందిస్తాడని నివాళి అర్పించారు. కాంతివంతమైన దీపాల్లో ఒకటి మనకు దూరంగా వెళ్లిపోయిందంటూ బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ నివాళి అర్పించారు. నెల్సన్ మండేలా మన కాలంలోనే కాదు ఎల్లప్పుడూ ఒక నాయకుడిగానే నిలిచిపోతారు. స్వేచ్ఛాయుత దక్షిణాఫ్రికాకు మొదటి అధ్యక్షుడిగా పని చేసిన ఆయన స్వాతంత్య్రం కోసం, న్యాయం కోసం పోరాడిన వ్యక్తిగా కీర్తించారు.
మండేలాకు పార్లమెంట్ ఘన నివాళి
న్యూఢిల్లీ : నల్లజాతి సూర్యుడు, ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు పార్లమెంట్ ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి. అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా లోక్‌సభలో మండేలా సేవలను సభ్యులు గుర్తు చేసుకుని ఆయన గొప్పతనాన్ని కీర్తించారు. కేంద్ర ¬ంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ జాతి వివక్షపై జైలు నుంచే మండేలా పోరాడారని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1990లో భారతరత్నతో గౌరవించిందని షిండే గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ తరపును ఆపార్టీ నేత సుష్మా స్వరాజ్ మండేలాకు నివాళులు అర్పించారు. 28 ఏళ్లు జైలులో గడపటం చిన్న విషయం కాదని, మహాత్మాగాంధీ ప్రేరణతో మండేలా పోరాటం చేశారని ఆమె అన్నారు. ఆయన పోరాటం అనన్య సామాన్యమని అన్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ చూపిన మార్గంలో మండేలా పయనించి జాతి వివక్షపై పోరాటం చేశారన్నారు. ఆయన మహానుభావుడని కొనియాడారు. రాజ్యసభ కూడా మండేలాకు ఘనంగా నివాళులు అర్పించింది. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు పార్లమెంట్ ఘనంగా నివాళులర్పించింది. మండేలా మృతిపట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపి ఆయన కృషిని కొనియాడారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ విూరాకుమార్ ప్రకటించారు.
ఐదు రోజుల సంతాపదినాలు
నల్లసూరీడుగా యావత్ ప్రపంచం కొనియాడిన నేత నెల్సన్ మండేలాకు గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం ఐదు రోజుల సంతాపదినాలు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం మండేలాకు నివాళులర్పించింది. భారత జాతి యావత్తు ఈ విషాద సమయంలో దక్షిణాఫ్రికాకు అండగా నిలుస్తోందని కేంద్రమంత్రి మనీష్ తివారీ పేర్కొన్నారు.
అస్తమించిన నల్లజాతి సూరీడు




