Tuesday, 3 November 2026

కిరణ్‌ గవే కిరికిరి మాటలు

అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిస్తాం : సీఎం కిరణ్‌
విజయవాడ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై మళ్లీ గవే కిరికిరి మాటలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ఎట్టి పరిస్తితుల్లోనూ ఒప్పుకోబోమని సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించి తీరతామని ఆయన అధిష్టానికే హెచ్చరికలు పంపారు. అసెంబ్లీలో ఓడిన బిల్లును పార్లమెంటులో ఎలా నెగ్గిస్తారో చూస్తామని కూడా ఆయన కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర నాయకత్వానికి సవాలు విసిరారు.ఆంధ్రప్రదేశ్‌ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్‌ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని అన్నారు. విజయవాడలో శనివారం సాయంత్రం నిర్వహించిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్‌ ఎలాగైనా రాష్ట్ర విభ జనను అడ్డుకుని తీరతామని గట్టిగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు చేసిన పాపం కాంగ్రెస్‌ రెండుసార్లు అధికారం ఇవ్వడమేనా అని ప్రశ్నించారు. కేసీఆర్‌, జగన్‌, చంద్రబాబు చెప్పినట్లు విభిజిస్తారా అని అడిగారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయండి.. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయండి.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయండి, వాళ్ల ముగ్గురిని కాంగ్రెస్‌లో కలుపుకోండి కానీ రాష్ట్రాన్ని విభజించవద్దని అన్నారు. ఎవరికోసమో విబజన చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అడిగారనో, జగన్‌ కలుస్తారనో, చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారనో రాష్ట్రాన్ని విభజిస్తారా? కావాలంటే వారిని కలుపుకోండి, ముఖ్యమంత్రిని చేయండి, రాష్ట్రాన్ని మాత్రం సమైక్యంగానే ఉంచండి అని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన ముసాయిదా బిల్లులో రాజ్యాంగానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయని పత్రికలలో వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రం కోసం ఇంత పెద్ద ప్రజా ఉద్యమం జరుగుతంటే ఢిల్లీ పెద్దలు కళ్లు, చెవులు కళ్లు మూసుకుందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో విభజన బిల్లు ఖచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎలా ఆమోదిస్తుందో చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం గనుక ఒకటిగా లేకుంటే నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను కట్టుకుని ఉండగలిగేవారిమా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులవల్ల అటు ఆంధ్ర ప్రాంతానికి, ఇటు తెలంగాణ ప్రాంతానికి కూడా ఎంతో మేలు చేసిందని ఆయన పార్టీ కేంద్ర నాయకత్వానికి గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు తాము సహకరించమని గట్టిగా చెబుతున్నాం అని సభికుల చప్పట్ల మధ్య కిరణ్‌ గట్టిగా చెప్పారు. విభజన నిర్ణయం తప్పు అని ఎత్తి చూపుతూ ఏ ప్రాజెక్టు వల్ల ఏ ప్రాంతానికి ఎంత లాభమో, విభజన వల్ల తెలంగాణకు సైతం ఎంత నష్టమో ఆయన వివరించారు. ఇన్ని తప్పులున్నప్పుడు ఒక్కసారి అన్నిటినీ సరిచూసుకుని ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకుంటే ఇక్కడున్న ప్రజలు అందరూ సంతోషిస్తారు. విభజన బిల్లును ఖచ్చితంగా ఓడిస్తాం, ఓడిపోయిన బిల్లును పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారో చూస్తాం అని కిరణ్‌ హెచ్చరించారు. డిసెంబర్‌ 21, 1972 లో పార్లమెంటులో ఇందిరా గాంధీ ఏం చెప్పారో ఒక్కసారి చదువుకోండి. అందుకే చెబుతున్నా విభజనకు వ్యతిరేకమని అని ఆయన పునరుద్ఘాటించారు. ఇప్పుడు విడిపోవడంవల్ల తెలంగాణ కూడా ఇబ్బందులకు గురవుతుందని ఆయన హెచ్చరించారు. విభజనతో నీళ్లు ఎవరికీ చెందకుండాపోతాయని ఆయన హెచ్చరించారు. అందుకే ఆ రోజున ఇందిరా గాంధీ అన్ని ప్రాంతాలకూ గట్టిగా ముడి పెట్టారని, దాన్ని విడదీయడం అంత తేలిక కాదని ఆయన చెప్పారు. అందుకే అన్ని అంశాలనూ దృష్టిలో ఉంచుకుని ఒక్కసారి అందరూ ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 1994లో కాంగ్రెస్‌ పార్టీకి 25 సీట్లు కూడా లేవు, మేమంతా ఓడిపోయాం- ఒక్క కన్నా తప్ప. విూ సహాయంతో, ప్రజల అండదండలతో మళ్లీ గెలిచాం అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇంత బలం ఉంటే ఇప్పుడు చేజేతులా నాశనం చేసుకున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి అని చెబుతూ ఎవ్వరూ శాశ్వతం కాదని, భారత దేశం శాశ్వతం అని, ఆంధ్రప్రదేశ్‌ శాశ్వతం అనీ ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో 294 సీట్లలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు అధికారంలో ఉంటారు. ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్‌ అధికారంలో కూర్చుంది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది. మరి 75-80 శాతం ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారు, అయినా విభజిస్తామంటున్నారు అని ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విరుచుకుపడ్డారు. ఇటీవల బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఈ ట్రిబ్యునల్‌ తీర్పు అంటే అంటే సుప్రీం కోర్టుతో సమానం. మరి ఇప్పుడు నీటి సమస్యపై ఉమ్మడి బోర్డులు అంటున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని ఆయన అన్నారు. విభజనతో నీటి సమస్యలు తప్పవని, పంపిణీ కష్టమవుతుందని ముఖ్యమంత్రి మరోమారు హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు విజబన జరిగితే పంపిణీలో తేడాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే నాగార్జునసాగర్‌, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను నిర్మించుకోగలిగామని, విభజన జరిగితే ప్రాజెక్టుల నిర్మాణం కష్టమవుతుందన్నారు. ఎక్కువ శాతం రైతులకు సాగునీరు అందుతుంది కాబట్టే రైతులు ప్రాజెక్టులకు భూమి త్యాగం చేశారని గుర్తుచేశారు. ఇరు ప్రాంతాల రైతులు సాగర్‌, శ్రీశైలం కోసం భూములు వదులుకున్నారని చెప్పారు. పోలవరం పూర్తయితే 307 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని, 23 లక్షల ఎకరాల ఆయుకట్ట స్థిరీకరణ చేయవచ్చన్నారు. 1956 తరువాత తెలంగాణలో అదనంగా 47 శాతం భూమి సాగులోకి వచ్చిందని, ప్రస్తుతం మరో 80 లక్షల ఎకరాలు సాగులోకి రాబోతోందని తెలిపారు. రాష్ట్రం విడిపోతే మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులు వృథా అవుతాయన్నారు.ఆంధప్రదేశ్‌ రాష్ట్ర విభజన 75 శాతం ప్రజల మనసును గాయపరుస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే విభజనపై మరోసారి ఆలోచించాలని ఢిల్లీ పెద్దలను కోరారు. ఎవరి స్వార్థం కోసమో రాష్టాన్న్రి వేరు చేయొద్దన్నారు. భారతదేశం, ఆంధప్రదేశ్‌ శాశ్వతం గాని, మనుషులు శాశ్వతం కాదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే 2 లక్షల మంది ఉద్యోగులు వారి ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వస్తుందని తెలిపారు. దీంతో వారి సీనియారిటీపై ప్రభావం చూపి, వారు చాలా ప్రయోజనాలు కోల్పోవలసి వస్తుందన్నారు. ముఖ్యమంత్రులు ఏ ప్రాంతం వారైనా తెలంగాణకు అన్యాయం చేయలేదన్నారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు ఒకే ఒక్క కళాశాల ఉండేదని, ప్రస్తుతం వేలాది కళాశాలలు, విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో కొలువై ఉన్నాయన్నారు. దీన్ని అభివృద్ధి కాక మరేమంటారని ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఇందిరాగాంధీ గట్టిముడి వేశారని, దానిని కాంగ్రెస్‌ పార్టీయే విడిదీయడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఇటువంటివే ఉద్యోగాల విషయంలోగాని, విద్యా అవకాశాల విషయంలో గాని చాలా లొసుగులు ఉన్నాయని ఆయన చెప్పారు. సమైక్య ఆంధ్ర మా నినాదం కాదు, విధానం అంటూ సభకు హాజరైన ప్రజలచేత ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సమైక్యాంధ్రకు జై కొట్టించి ఆయన సభను ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *