లోపాలు సరిదిద్దుకుంటాం : సోనియా
కాంగ్రెస్‌కు ఓ హెచ్చరికలాంటిది : రాహుల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 8 (జనంసాక్షి) :
నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నాం.. ఓటమిపై లోతైన అధ్యయనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియా, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో వారు మీడియాతో మాట్లాడారు. తొలుత సోనియాగాంధీ మాట్లాడుతూ, తమ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఒక కారణమని తెలిపారు. తమ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది.. అందుకే ఇలాంటి ఫలితాలు వెల్లడయ్యాయని సోనియా అన్నారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు వ్యత్యాసం ఉందన్నారు. శాసనసభ ఎన్నికలలో ఆయా వ్యక్తుల ఛరిష్మాను బట్టి ఫలితాలు ఉంటాయన్నారు. అదే లోక్‌సభ ఎన్నికల్లో అయితే జాతీయస్థాయిలో చూస్తారని అన్నారు. ఏదేమైనా, ఎన్నికల ఫలితాలను వినమ్రతతో స్వీకరిస్తున్నామని తెలియజేశారు. ప్రధాని అభ్యర్థి విషయంలో తగిన సమయంలో నిర్ణయిస్తామని చెప్పారు. ప్రచారంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇలా ఉండగా, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, ప్రజలు తమకొక సందేశం ఇచ్చారన్నారు. ఈ ఫలితాలు తమకొక హెచ్చరిక లాంటివని అన్నారు.తమ పాలనలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్నారు. సరిదిద్దుకుంటామని హామీనిచ్చారు. ప్రజల నమ్మకాన్ని సాధించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. విజయం సాధించిన అభ్యర్థులకు రాహుల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎన్నికలు తమ పార్టీకి ఒక గుణపాఠమని అన్నారు. ఫలితాలపై లోతుగా విశ్లేషించుకుంటామని చెప్పారు. ఎన్నికల ఫలితాలను వినమ్రతతో స్వీకరిస్తున్నామని అన్నారు. షీలాదీక్షిత్ మంచి పరిపాలన అందించారన్నారు. సాధారణ ప్రజలను పట్టించుకోవలసి ఉందన్నారు. కేజ్రీవాల్ ప్రజల్లోకి బాగా చొచ్చుకు పోయారన్నారు. ప్రజలను ఆప్ బాగా చేరదీసిందని, కేజ్రీవాల్ చాలా కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు. ఇకముందు నుండి ప్రజల కోణం నుంచి చూస్తామని అన్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా పార్టీ పరివర్తన చెందుతుందని దిశానిర్దేశనం చేశారు.
ఫలితాలపై లోతైన అధ్యయనం చేస్తాం




