ఎన్నికల ఫలితాలు వేరు తెలంగాణ వేరు

బిల్లు పాసయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలి : కోదండరామ్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) :
ఎన్నికల ఫలితాలు వేరు తెలంగాణ అంశం వేరని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన బిల్లు వేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వేరన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకూ అప్రమత్తంగా ఉంటామని తెలిపారు. తెలంగాణ జర్నలిస్ట్‌ ఫోరమ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బిల్లులో ప్రస్తావించిన అంశాలపై అసంతృప్తిగా ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఏడు ప్రధాన అంశాలపై టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ మంగళవారం ప్రధానమంత్రికి లేఖ రాస్తారని కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా దెబ్బతిందని.. తేడా వస్తే తెలంగాణలో అంతకన్నా ఎక్కువ దెబ్బ తింటుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన జీవోఎం నివేదికపై జేఏసీ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా విభజన ఖాయమని పేర్కొన్నారు. బిల్లు పాసయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. బిల్లులో సవరణలు జరపాలని, లేదంటే తెలంగాణ ప్రజలకు అప్పులు మిగులుతాయని తెలిపారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో బిల్లు ఆమోదం పొందకుండా చూస్తామన్నారు. ఆంక్షలతో ఇచ్చే తెలంగాణపై పోరాడుతామన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యే వరకు తాము అప్రమత్తంగా ఉంటామని, కుట్రలను ఎదుర్కొంటామని అన్నారు. ఇదిలావుంటే కేబినెట్‌ నోట్‌లో అభ్యంతరాలపై నివేదిక రూపొందిస్తున్నట్లు బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. నివేదిక నోట్‌లోని తమ అభ్యంతరాలను తమ నేత సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌ లోవ్యక్తం చేయనున్నారని తెలిపారు. ఆంధ్రా విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రాతినిధ్యం ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇక్కడ విద్యాసంస్థల్లో ప్రాతనిధ్యం కోరడాన్‌ఇన తాము అంగీకరించమన్నారు. వివిధ అంశాలపై ఉన్న లోటుపాట్లను పార్లమెంటులో బిజెపి ప్రస్తావిస్తుందన్నారు. దీనికి సంబంధించి పూర్తి నివేదిక రూపొందిస్తున్నామని అన్నారు. బిల్లులో ప్రస్తావించినట్లుగా హైదరాబాద్‌పై ఆంక్షలను అంగీకరించేది లేదని కేటీఆర్‌ అన్నారు. నదీ జలాలపై బోర్డులకు విశేష అధికారాలు కట్టబెట్టడం సరికాదన్నారు. ఆంక్షల తొలగింపుపై మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ రేపు ప్రధానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. దీనిపై పార్లమెంటులో పోరాడుతామని అన్నారు. ఆంక్షలు లేకుండా తెలంగాణ ఇవ్వాలన్నదే తమ అభిమతమన్నారు. ఇతర రాష్ట్రాలకు లేదా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు లేని ఆంక్షలు ఇక్కడే ఉండడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వీటిని అంగీకరించబోమన్నారు. నదీజలాలు, హైదరాబాద్‌పై ఆంక్షలు, పెన్షన్ల చెల్లింపులపై తమ నాయకుడు కేసీఆర్‌ ఇప్పటికే వివరించారని అన్నారు.