ఇంతనగ్నంగా బాబు బయటికొచ్చాక టీడీపీలో తెలంగాణ బిడ్డలెట్లుంటరు
విభజన ముసాయిదాపై అభ్యంతరాలున్నాయి
రాజీనామా విసిరికొట్టి బయటికి రావాలి
ఇన్ని రంగులు.. గిన్ని నక్కజిత్తులా?
గింత పనికి మాలిన నాయకుడ్ని ఎక్కడ చూడలే
చంద్రబాబుపై కేసీఆర్ ఆర్ పార్
హైదరాబాద్, డిసెంబర్ 10 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదాపై అభ్యంతరాలున్నాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణపై బాబు ఇంత నగ్నంగా బయటికొచ్చాక కూడా తెలంగాణ బిడ్డలు ఇంకా ఆ పార్టీలో ఎట్లుంటరని ప్రశ్నించారు. రాజీనామాలు బాబు ముఖాన విసిరికొట్టి బయటికి రావాలని సూచించారు. ఇన్ని రంగులు.. నక్కజిత్తులు ప్రదర్శించే పనికిమాలిన నాయకుడ్ని మరెక్కడా చూడలేదని మండిపడ్డారు. మంగళవారం నగరంలోని తెలంగాణ భవన్లో పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై సీమాంధ్ర నేతలు ముఖ్యంగా చంద్రబాబు, జగన్ విషం కక్కుతూనే ఉన్నారని, తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మూడు పార్టీలు కలిసి పెట్టిన అవిశ్వాసం నిలిచేది కాదన్నారు. ఎవరికీ ఏదీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ ఓటమి ప్రజాస్వామ్య పక్రియలో భాగమేనని కేసీఆర్ పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతే కేందప్రభుత్వం పడిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. ఇంతదూరం వచ్చిన తర్వాత రాష్ట్ర విభజనను ఆపడం ఎవరి వల్లా కాదని కేసీఆర్ అన్నారు. విభజన ముసాయిదా బిల్లుకు పార్లమెంటులో సవరణలు ప్రతిపాదిస్తామన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశామని అన్నారు. విభజనపై చంద్రబాబు ఇంకా విషం కక్కుతూనే ఉన్నారని కెసిఆర్ విమర్శించారు. ఇంత జరిగాక కూడా తెలంగాణ తెలుగుదేశం నేతలు పార్టీలో కొనసాగడం అనైతికమన్నారు. టీడీపీ నేతలకు రోషముంటే పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతలు ఇప్పటికైకా కళ్లు తెరిచి ఆ పార్టీ నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వైఎస్ఆర్సీ పార్టీ అడ్రస్ గల్లంతయ్యిందని ఆ పార్టీ ఇక్కడ అంతరించిపోయిందని గుర్తు చేశారు. ఇంకా కొందరు తెలంగాణ బిడ్డలు వైఎస్ఆర్సీ పార్టీలో కొనసాగడం కన్నతల్లికి కొరివిపెట్టడమేనన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. మద్రాస్ నుంచి ఆంధ్రా విడిపోయిన సందర్భంలో వీరు చేసిన పిచ్చిపనుల వల్లే ఆనాడు రాజాజీ ఆంధ్రాప్రజలను వెళ్లగొట్టాడని గుర్తు చేశారు. విభజనపై ఉన్న అభ్యంతరాలను వివరిస్తూ ప్రధానమంత్రి మన్మొహన్సింగ్నకు టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ 14 పేజీల లేఖ రాశారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో అభ్యంతరాలపై ప్రధానికి వివరణ ఇచ్చారు. డ్రాప్ట్ బిల్లులో కొన్న అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సవరణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాసినమని తెలిపారు. తెలంగాణ ప్రజలకు అంగీకారం కాని అంశాలను లేఖలో ప్రస్తావించామన్నారు. నీటి పంపకాలు, ఉద్యోగుల పెన్షన్లపై న్యాయం జరగలేదన్నారు. గవర్నర్ చేతిలో శాంతి భద్రతలు పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు. నేటివిటీ ఆధారంగానే ఉద్యోగులను, పెన్షనర్లను విభజించాలని పేర్కొన్నారు. ఎక్కడ డబ్బు ఖర్చయితే ఆ రాష్ట్రమే అప్పు భరించాలని తేల్చి చెప్పారు. హైకోర్టు విభజన, రాజ్యసభ సభ్యుల సంఖ్యపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, విభజన బిల్లులో సవరణలపై ప్రధానికి రాసిన లేఖలో వివరించామని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా ముల్కీరూల్స్ ఉన్నాయని, 1919లోనే నిజాం ముల్కీ నిబంధనలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆంధప్రదేశ్ ఏర్పాటు తర్వాత కూడా వాటిని కొనసాగిస్తామన్నారని, 1985లో 610 జీవో తెచ్చారని కేసీఆర్ అన్నారు. అక్రమంగా నియమితులైన ఉద్యోగులను వెనక్కి పంపలేదని, వారంతా ఇక్కడ పదవీ విరమణ పొందారని, ఇప్పుడు వారి పింఛన్లు విడిపోయాక తెలంగాణ ప్రభుత్వం భరించాలనడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. అప్పులకు సంబంధించిన పంపిణీ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామన్నారు.గవర్నర్ చేతిలో హైదరాబాదు శాంతిభద్రతలు ఉంచడాన్ని తాము అంగీకరించమన్నారు. ఇదిలావుంటే సీమాంధ్ర నేతలు ఎన్ని డ్రామాలు వేసినా తెలంగాన ఏర్పాటును అడ్డుకోలేరని, అలాగే వారు తెలంగాన ప్రజల్లో చులకన కాక తప్పదని హెచ్చరించారు. ఆంధ్రా ప్రజలను వంచిస్తూ అక్కడి ప్రజలకు ఏం కావాలో కోరకుండా సీమాంధ్ర నేతలు డ్రామాలు ఆడుతున్నరని తెలిపారు. తెలంగాణ ప్రజల సహృదయత గుర్తించి మెలగాలని తెలిపారు. తెలంగాణ ప్రజలు విడిపోవాలంటే కలిసుండాలని కోరడం అవివేకమని పేర్కొన్నారు. వీరెన్ని కుట్రలు పన్నినా పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఎవరూ అడ్డుకోలేరని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా తీర్మానం నెగ్గదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా అంగీకరించామని, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల గురించి ఆ ప్రాంత నేతలే మాట్లాడలన్నారు. తనకు సీఎం, పీఎం పదవో కాదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమన్నారు. తమది ఎగువ రాష్ట్రమని, సీమాంధ్రది దిగువ రాష్ట్రామని తగువు పెట్టుకుంటే మీరే నష్టపోతారంటూ ఆయన సీమాంధ్ర నేతలను ఈ సందర్భంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రికి రాజ్యాంగంపై అవగాహన లేదని కిరణ్ సీఎం పదవికి అనర్హుడంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు ఒక్కరోజు చాలని అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు వైఖరేంటో బయటపడింది కనుక తెలంగాణ టీడీపీ నేతలు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాహాటంగా విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. టిటిడిపి నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.తెలంగాణపై విషం చిమ్ముతున్న చంద్రబాబు కాళ్ల వద్ద టిటిడిపి నేతలు పడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగు తెలంగాణలో జెండా పీకేశారని, ఇంకా ఆ పార్టీలో ఎవరైనా ఉంటే తెలివి తక్కువతనమే అన్నారు. తెలంగాణలో జగన్ పార్టీ కథ ముగిసిందన్నారు. నాయకులు సీమాంధ్ర ప్రజలను వంచించకుండా ఏం కావాలో డిమాండ్ చేయాలన్నారు. చంద్రబాబు వంటి లత్కోర్ నాయకులు ఉండరన్నారు. ఆయన ఎన్నిసార్లు మాటలు మారుస్తారని ప్రశ్నించారు. టిటిడిపి నేతలు ఇప్పటికైనా కళ్లు తెరిచి బయటకు రావాలన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. తెలంగాణను అఢ్డుకునేందుకు జగన్ దేశమంతా తిరుగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ కుర్చీకి అర్హుడే కారన్నారు. రాజ్యాంగంపై సిఎంకు అవగాహన లేదన్నారు. సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం ఉండదన్నారు. జబర్దస్త్‌గా కలిసుండాలని డిమాండ్ చేసే హక్కు సీమాంధ్ర నేతలకు ఎక్కడిదన్నారు. సామరస్య పూర్వక విభజనకు ముందుకు రావాలని లేదంటే సీమాంధ్ర నేతలు వారి ఖర్మ వారు అనుభవించక తప్పదన్నారు. మనలో ఎవరం ఇక్కడ వెయ్యి సంవత్సరాలు బతికేందుకు రాలేదని, నేతలు విషబీజాలు నాటడం మానుకోవాలన్నారు. హైదరాబాదును ఖాళీ చేయాల్సి వస్తుందనే చంద్రబాబు బాధ అన్నారు. అనంతపురం సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు. రేపో లేదా ఎల్లుండో అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని, తెలంగాణ బిల్లు అంటే అదేదో బ్రహ్మపదార్థం కాదని, ఈజీగా అది పాస్ అవుతుందన్నారు. తెలంగాణ బిల్లు పైన చర్చ మాత్రమే ఉంటుందని, తీర్మానం ఉండదని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు, ఇతర రాష్ట్రాల ఏర్పాటుకు వ్యత్యాసం ఉందని చెప్పారు.రాష్ట్రం విడిపోక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. వలస సీమాంధ్రులు చేసిన తప్పు వల్లనే తెలంగాణ డిమాండ్ వచ్చిందన్నారు. సీమాంధ్రలో ప్రాజెక్టులు పూర్తయినా, తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. తమ డిమాండ్‌ను కేంద్రం గుర్తించిందని, విడిపోయాక కూడా మంచిగా కలిసుందామని, అనవసర యాగీ చేయవద్దని సూచించారు.