Tuesday, 3 November 2026

ముసాయిదాపై అభిప్రాయమే.. ఓటింగ్‌ ఉండదు

శాసనసభ వ్యవహారాల సమావేశంలో శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) :
తెలంగాణ ముసాయిదాపై శాసనసభలో అభిప్రాయాలు చెప్పడం మినహా ఓటింగ్‌ జరుగదని శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం సాయంత్రం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాలు ఏడు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్రభుత్వం మూడు రోజులపాటు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వార్తలు రాగా, ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు ఏడు రోజులపాటు నిర్వహించేందుకు సిద్ధమైంది. గురువారం ఉదయం సభ కొలువుదీరగానే దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా మృతిపట్ల సభ సంతాపం తెలుపుతుంది. అనంతరం పైలిన్‌, హెలెన్‌ తుపానులు, వరదలు నష్టాలపై, రైతులకు అందించాల్సిన నష్టపరిహారం చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశాలున్నాయి. పాలెం బస్సు ప్రమాద దుర్ఘటనపై, బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయని వైనంపైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశం ఉంది. వీటన్నింటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం మరోమారు స్పీకర్‌ కార్యాలయంలో బీఏసీ సమావేశం జరుగనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రపతి నుంచి వచ్చిన తెలంగాణ ముసాయిదాపై చర్చిస్తారు. సీమాంధ్ర నేతలు చెప్తున్నట్లుగా తెలంగాణ ముసాయిదాపై అసెంబ్లీలో ఓటింగ్‌ ఉండదని శ్రీధర్‌బాబు తేల్చిచెప్పారు. సభ్యుల అభిప్రాయం మాత్రమే తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు శ్రీధర్‌బాబు, ఆనం రామనారాయణరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణ, ప్రభుత్వ విప్‌ అనిల్‌ తదితరులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయమ్మ, శోభానాగిరెడ్డి, బిజెపి తరఫున యెండల లక్ష్మీనారాయణ, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ, సిపిఎం తరఫున జూలకంటి రంగారెడ్డి, సిపిఐ తరఫున గుండా మల్లేష్‌ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *