బాబూ! నువ్వో రక్త పిశాచి
నేను ఎవుసం చేసుకుంటే నీకేంది?
చర్చకు రా.. నీ బండారం బయటపెడతా : కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 11 (జనంసాక్షి) :
ఎన్కౌంటర్ల పేరుతో వందలాది మంది యువకుల ప్రాణాలు తీసిన రక్తపిపాసి చంద్రబాబేనని, అవినీతికి ఆయన మారుపేరని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు రక్తపిశాచి అని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోతెలంగాణ భవన్లో ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పద్నాలుగేళ్ల నుంచి కేసీఆర్ ఏం చేశాడో దేశానికి తెలుసని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన చంద్రబాబు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాలు విసిరారు. తెలంగాణ అభివృద్ధిపై బాబు చేసిన సవాల్‌కు కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. బాబు రక్తదాహం ఫలితంగానే అలిపిరి దాడి జరిగిందని అన్నారు. తన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, బహిరంగ చర్చకు వస్తే తన చరిత్ర ఏంటో, చంద్రబాబు చరిత్ర ఏంటో తేలిపోతుందని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను కేంద్ర మంత్రి పదవిని కూడా గడ్డిపోచలా వదిలేస్తే బాబు మాత్రం పదవి కోసం మామకే వెన్నుపోటు పొడిచాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాగానే లోకేశ్, బ్రహ్మణి, భువనేశ్వరి.. ఇలా అందరి పేర్ల మీద ఉన్న బినామీ భూములన్నింటినీ కక్కిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు తనతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి చిదంబరమే స్వయంగా చెప్పారని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నది బాబేనని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ కోసం తాను రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి చెప్పి మరీ నేను ఆమరణ దీక్షకు దిగాను. చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు దీక్ష చేశాడో చెప్పగలడా? ఒక్కోసారి ఒక్కోమాట చెబుతావు. ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చింది నువ్వు కాదా? ఉప ఎన్నికల్లో 12కు 12 స్థానాల్లోనూ డిపాజిట్లు పోయినా ఇంకా బుద్ధి రాలేదా? ఇలాంటి దొంగలకు ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారా? అని కేసీఆర్ అడిగారు. తాను ఫామ్‌హౌస్‌లో పడుకుంటానని అన్న బాబు విమర్శలపైనా కెసిఆర్ మండిపడ్డారు. ఫాంహౌస్‌లో పడుకుంటా, నా ఇష్టం. నీకేం బాధ? కావాలంటే నువ్వు కూడా రా.. నీకేం అభ్యంతరం? కావాలంటే వారం రోజులుంటా, వ్యవసాయం చేసుకుంటా. నాకు వచ్చిన పనేంటో చూసుకుంటా. నీకేం అభ్యంతరమని ప్రశ్నించారు. తనకు అధికారం పోయింది టిఆర్ఎస్ వల్లనేనని చంద్రబాబు బాధ అన్నారు. తన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. తనకు వ్యవసాయం ఉందని, ఫామ్ హౌస్‌లో ఎన్నో పనులుంటాయని, హైదరాబాదులో కూర్చుని చీకటి కుట్రలు చేసే అలవాటు తనకు లేదని కేసీఆర్ అన్నారు. అవకాశవాదం, నమ్మకద్రోహం లాంటివి చంద్రబాబుకే బాగా వర్తిస్తాయన్నారు. తెలంగాణను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబువి కల్లబొల్లి మాటలన్నారు. ఎవరి చరిత్ర ఏమిటో చర్చించుకునేందుకు, చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. చంద్రబాబు తనతో మాట్లాడారని నిండు పార్లమెంటులో చిదంబరమే చెప్పారని గుర్తుచేశారు. తనపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. దమ్ముంటే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. స్థలమెక్కడో బాబే చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎందరో యువకుల ప్రాణాలను బలిగొన్న రక్తపిశాచి అని విమర్శించారు.