అవిశ్వాసం ప్రతిపాదించిన ఎంపీలపై వేటు?
తెలంగాణ ముసాయిదా త్వరగా ఢిల్లీకి పంపేందుకే పర్యటన
న్యూఢిల్లీ, డిసెంబర్ 11 (జనంసాక్షి) :
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ గురువారం ఉదయం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా శాసనసభ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఆయన రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరుపుతారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు తిరునావక్కరసు, ఆర్.సి. కుంతియాలు కూడా వస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు కాంగ్రెస్ సభ్యులు ఆమోదం తెలిపేలా దిగ్విజయ్ అధిష్టానం నిర్ణయాన్ని వారికి చేరవేస్తారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతాయో కూడా హెచ్చరిస్తారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. వారు నోటీసు ఉపసంహరించుకోవడమా? క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవడమా? ఏదో ఒకటి తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ వారు దిగిరాకుంటే పార్లమెంటరీ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తప్పవన్నారు. మరోవైపు ఈ విషయమై సొంతపార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన కాంగ్రెస్ సీమాంధ్ర సభ్యులపై చర్యలు తప్పవని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో తేల్చిచెప్పారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని చాకో ధీమా వ్యక్తం చేశారు. ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారిపై వేటు వేయడం ఖాయమని స్పష్టం చేశారు. మరో 3, 4 నెలల్లో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఏపార్టీ కూడా ముందస్తు ఎన్నికలు కోరుకోవడం లేదన్నారు. ఈ దశలో ఎవరూ ముందస్తు ఎన్నికలు కోరుకోవటం లేదని ఆయన తెలిపారు. ఆంధప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు.. సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ విూరాకుమార్‌కు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అనుకుంటున్నారు. ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి పైన కూడా చర్యలకు సిద్ధమవుతోంది. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడుగా గెలుపొందిన ఎస్పీవై రెడ్డి ఇటీవల జగన్ పార్టీలో చేరారు. దీంతో ఆయన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులతో కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు వైయస్ జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డిలతో కలిసి నోటీసును ఇచ్చారు. దీంతో ఆయనపైనా చర్యలకు అధిష్టానం సిద్ధపడుతోంది.
నేడు రాష్ట్రానికి డిగ్గిరాజా




