Wednesday, 4 November 2026

ఎట్టకేలకు అసెంబ్లీకి చేరిన ముసాయిదా

స్పీకర్‌ చేతికి ప్రతులు
సోమవారం బీఏసీ
హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) :
తెలంగాణ ముసాయిదా బిల్లు ఎట్టకేలకు శాసనసభకు చేరింది. బిల్లుపై సంతకం చేసి అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణికు పంపించామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుకు భాషాపరమైన సమస్యలు ఉన్నాయని, నిబంధనల ప్రకారం మూడు భాషల్లో ఉండాల్సిన బిల్లు ప్రతులు ఇంగ్లిష్‌లో ఉందని, తెలుగు, ఉర్దూలోకి అనువదించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తదుపరి చర్యలపై చర్చలు జరుపుతున్నట్లు సీఎం తెలిపారు.ముసాయిదా బిల్లుపై చర్చ ఎప్పుడన్నది సోమవారం బిజినెస్‌ అడ్వజయిరీ కమిటీ (బీఏసీ)లో నిర్ణయం జరుగుతుందని సీఎం కిరణ్‌ తెలిపారు. బిల్లులోని ప్రతి క్లాజుపై ఓటింగ్‌ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గడువు సరిపోతుందా, లేదా అన్నది ఇప్పేడే చెప్పలేమని సీఎం పేర్కొన్నారు. 371 డి సవరణకు సభ్యుల్లో రెండింట మూడొంతుల మెజారిటీ అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. బిల్లులో 371 హెచ్‌ ఉందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. విభజన బిల్లులో చాలా తప్పులు ఉన్నాయని, 371డికు శాసనసభలో సవరణ కోరారని, అసెంబ్లీలో 2/3వ వంతు మెజారిటీ వస్తేనే సవరణ సాధ్యమవుతుందని సీఎం కిరణ్‌ అన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తనవద్ద ఆలస్యం లేకుండా పంపానని, తెలంగాణ బిల్లు పైన చర్చ ఎప్పుడనేది బిఎసి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతులను తెలుగు, ఉర్దూ భాషల్లోకి అనువాదం చేయాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇచ్చిన సమయం సరిపోతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. బిల్లులోని ప్రతి క్లాజు పైన ఓటింగు అవసరమన్నారు. తెలంగాణ బిల్లును సభ్యులకు ఇచ్చే అంశం సభాపతి చూసుకుంటారన్నారు. బిల్లుపై సీక్రేట్‌ అని ఉన్నందున సభ్యులకు రహస్యంగా ఇవ్వాలా లేక ఓపెన్‌గా ఇవ్వాలా అనే అంశాన్ని కూడా స్పీకరే చూసుకుంటారన్నారు. తాను దిగ్విజయ్‌తో వ్యతిరేకంగా మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ఇదిలావుంటే మంత్రులు ఉదయం సిఎంను క లసి వివిధ అంశాలతో పాటు విభజన బిల్లుపై చర్చించినట్లు సమాచారం. విభజన బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఆర్టికల్‌ 371(డీ) రాజ్యాంగ సవరణ అవసరమని రాష్ట్రపతి ఇచ్చిన నోట్‌లో వుందని విూడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో ప్రతి క్లాజ్‌పైనా శాసనసభలో ఓటింగ్‌, అభిప్రాయం అవసరమని పేర్కొన్నారు. ఈ ధైర్యంతోనే సిఎం బిల్లుపై సంతకం చేసి పంపారని తెలుస్తోంది. అయితే విభజన బిల్లును కేంద్రం జెట్‌ స్పీడులో రాష్ట్రానికి బిల్లు పంపితే, మంగళయాన్‌ స్పీడులో తిరిగి పంపిస్తామని ఆయన చమత్కరించారు. నీటి పంపకాల విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు.అంతకుముందు ఆయన మంత్రులతో ఇష్టాగోష్టిలో కూడా ఇదే భరోసా ఇచ్చారు. బిల్లు ఎట్టి పరిస్తితుల్లోనూ ఆమోదం పొందదని అన్నారు. ఇది ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. దీనికి అసెంబ్లీలో ఇప్పుడు అసాధ్యమన్నారు. విప్‌ జారీచేయాల్సిన అవసరం లేదని దిగ్విజయ్‌ అన్నారని అందువల్ల బిల్లు ఆమోదం పొందదని అన్నారు. రాష్ట్రపతి నుంచి ఆంధప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాత్ర చాలా కీలకంగా మారింది. శాసనసభ సమావేశాలు ఈనెల 20తో ముగుస్తుండగా ఈ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం రాదని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *